15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy Teleconference With Ysrcp Leaders | Sakshi
Sakshi News home page

15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల

Dec 13 2025 7:01 PM | Updated on Dec 13 2025 7:13 PM

Sajjala Ramakrishna Reddy Teleconference With Ysrcp Leaders

సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో​‍-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేర‌కు చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మ స్ఫూర్తితో కొన‌సాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. ల‌క్ష్యానికి మించి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం కొన‌సాగిందని సజ్జల వివరించారు.

‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ర‌చ్చ‌బండ కార్య‌క్రమం ఏర్పాటు చేసి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వివ‌రిస్తూ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాం. ఇప్ప‌టికే  సంత‌కాలు చేసిన ప‌త్రాల‌ను నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల‌ నుంచి జిల్లా కేంద్రాలకు త‌ర‌లించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్లు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

..వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్‌ జగన్‌ ప్ర‌జా ఉద్య‌మానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్య‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్‌ కాలేజీ ఉద్యమాన్ని నిర్వ‌హించ‌గా, దీనికి కొనసాగింపుగా నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంతకాల సేకరణ కార్య‌క్ర‌మం ఉత్సాహంగా కొన‌సాగింది.

..గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంత‌కాలు సేక‌రించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల‌ నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే  ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం.

..పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా  బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను వైఎస్‌ జగన్‌, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

టెలి కాన్ఫరెన్స్‌ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ ఇంఛార్జ్‌ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాల ప‌రిరక్ష‌ణే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీని లేకుండా చేయాల‌న్న కూట‌మి కుట్ర‌ల‌ను అధిగ‌మిస్తూ యువ‌త‌, ఉద్యోగులు, మ‌హిళ‌లు, కార్మికుల ప‌క్షాన పోరాడుతున్నాం. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, వ్యాపారం.. ఏ వ‌ర్గానికి ఆపదొచ్చిన వారి ప‌క్షాన నిల‌బ‌డి వైఎస్సార్‌సీపీ గ‌ళ‌మెత్తుతోంది. ఆయా వర్గాల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే దిశ‌గా ఏడాదిన్న‌రగా కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నినదిస్తూనే ఉన్నాం.

అందులో భాగంగానే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌తో వైఎస్సార్‌సీపీ ఒక పెద్ద ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించింది. చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ త‌ల‌పెట్టిన ఉద్యమానికి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ప‌లికారు. చంద్ర‌బాబు తీసుకున్న ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోటి మందికి పైగా ప్ర‌జ‌లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టికే సంత‌కాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement