సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.
ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.



