సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్‌లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు.


