సాక్షి, తిరుపతి: టీటీడీ బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల జగదీష్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు ఓ భక్తుడు ఈవోకు లేఖ రాశాడు. డైరెక్టర్ చేస్తున్న అక్రమాలను వివరించాడు.
మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోళ్లలో టెండర్ దారులకు అనుకూలంగా మార్పులు చేసి కొందరికి మేలు చేశారు. నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగించారు. గత మూడు నెలలుగా హాస్పిటల్‌లో సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉంది. బలవంతంగా ఆన్‌లైన్, టెలిఫోన్ ఓపిడి రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటలకు అపాయింట్‌మెంట్ ఓపిడి సేవలు ప్రారంభించడం వల్ల రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ అనుమతులు ఉన్నాయని జగదీష్ యదేచ్ఛగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రముఖ వైద్యులను శ్రీవారి ప్రొఫెషనల్ సేవకులుగా రాకుండా కక్ష్యపూరితంగా అడ్డుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో బర్డ్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2021లో నాసిరకం ఇంప్లాంట్స్ వాడటం వల్ల రోగులకు రెండవసారి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక డాక్టర్ జగదీష్ పై ఉన్న రెండు విజిలెన్స్ కేసుల పై చర్యలు తీసుకోవాలి. మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తంలో ఇంప్లాంట్స్ కొనుగోలు చేసి 11 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతోంది. గత 15 ఏళ్లలో దిగుమతి చేసిన సర్జికల్ ఇంప్లాంట్ల ధరలను పెంచి కొనుగోలు మార్గాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు. మొత్తం ఆర్థిక నష్టం సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
డాక్టర్ గుడారు వ్యక్తిగత సద్భావన, ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు, ప్రతిమను ఉపయోగించారు. వారి స్వీయ ప్రచారం కోసం సంస్థాగత పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆరోపణలన్నింటిపై విజిలెన్స్ విచారణ జరపాలి. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో అజ్ఞాత భక్తుడు ఈవోను కోరాడు.


