సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు పంటల బీమా వర్తింపజేయకుండా నిండా ముంచేశారు. దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా రాలేదు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3.77 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రాష్ట్రం నుంచి నివేదిక అందినట్లు మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రాష్ట్రంలో రైతులకు ఎటువంటి బీమా పరిహారం చెల్లించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవై కింద తన వాటాను చెల్లించలేదని తెలిపారు. పైగా ఈ ఏడాది ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై–పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఏపీలో కేవలం 5.3 లక్షలమంది రైతులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఈ నమోదైన రైతులకు కూడా ఎటువంటి బీమా క్లెయిమ్‌లను చెల్లించలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. 
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేశారు. రైతులే తమ పంటలకు బీమా చేసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్రంలో కేవలం 5.3 లక్షలమంది రైతులే బీమా కింద నమోదయ్యారు. అదే 2023–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖరీఫ్‌లోనే ఏకంగా 30.09 లక్షలమంది రైతులకు చెందిన 50.63 లక్షల ఎకరాల్లోని పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. చంద్రబాబు నిర్వాకం కారణంగా కేవలం 5.3 లక్షలమంది రైతులకే బీమా పరిమితం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం వాటా చెల్లించకపోవడంతో వారి పంటలకు కేంద్ర బీమా పరిహారం చెల్లించలేదు.


