తిరువూరు: ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్బుకా, పార్టీకా?’.. అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తన పార్టీ నేతలపై మరోమారు మాటల దాడికి దిగారు. పార్టీ మండల స్థాయి నేతను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి.
గత కొద్దికాలంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ ఇరువర్గాలుగా చీలిపోయింది. దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తంటాలు పడుతున్న సమయంలో కొలికపూడి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.
విస్సన్నపేట మండలానికి చెందిన ముఖ్యనేతను ఉద్దేశించి కొలికపూడి.. ‘పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్’ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పోస్టు చేయడంతో ప్రత్యర్థి వర్గం దీనికి కౌంటర్‌గా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యే తననుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, తాను సాయిబాబా సాక్షిగా ప్రమాణం చేసి తాను పేకాట శిబిరాలు నిర్వహించట్లేదని చెబుతానని, ఎమ్మెల్యే కూడా తనపై చేసిన ఆరోపణల నిరూపణకు ప్రమాణం చేస్తారా అని విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రశ్నించారు.
తిరువూరులో బెల్టుషాపులను అడ్డుకుంటానని చెప్పి మద్యం సిండికేట్ల వద్ద డబ్బు దండుకోవడం, ఎ.కొండూరు మండలం గోపాలపురంలో మట్టి తవ్వకాలకు యత్నించి గ్రామస్తులు ప్రతిఘటించడంతో తోక ముడవడం ఎమ్మెల్యేకే చెల్లిందని ప్రత్యారోపణ చేశారు. ఇక కొలికపూడి తమ ఎమ్మెల్యే అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నామన్నారు.


