ప్రశ్నపత్రానికి క్యూఆర్ కోడ్..
16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకూ పరీక్షలు పరీక్ష రాయనున్న 28,142 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు
పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 28,142 మంది విద్యార్థులు 149 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బాలురు 14,425 మంది, బాలికలు, 13,717 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 27,359 మంది రెగ్యులర్ విద్యార్థులు. పరీక్షల కాలం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఇప్పటికే ‘టెన్’షన్ మొదలైంది. తొలిసారి పబ్లిక్ పరీక్షలు అనగానే తెలియని ఆందోళన. తెలిసిన సమాధానాలే అయినా వాటిని పేపరుపై ఎలా రాయాలో తెలియక కొందరు సతమతమవుతారు. తరగతి గదిలో ఠకీమని జవాబు చెప్పే కొందరు విద్యార్థులు పరీక్షలలో మాత్రం వెనుకబడుతూంటారు. వచ్చిన సమాధానాలను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఆ చిన్న అవరోధాన్ని అధిగమిస్తే విజయం వారి పాదాక్రాంతమవుతుంది.
రెండు వేల మంది సిబ్బంది..
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలకు సుమారుగా రెండు వేల నుంచి 2100 మంది ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. అందులో డిపార్ట్‌మెంటల్ అధికారులుగా 149 మందిని, చీఫ్ సూపరింటెండెంట్లుగా 149 మందిని, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లుగా 1700 మంది సేవలందిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగే రోజున విధులను మార్పు చేస్తారు. జిల్లాలోని సుమారుగా 26 పోలీసుస్టేషన్ల పరిధిల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో అర్బన్‌లోని ఎనిమిది, రూరల్‌లోని 18 పోలీసుస్టేషన్‌లు ఈ పరీక్షలకు బందోబస్తును అందిస్తున్నాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు జరుగుతుంది.
483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు
ఈ పరీక్షలకు జిల్లాలోని 483 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,122 మంది విద్యార్థులు (5085 మంది బాలురు, 6037 మంది బాలికలు) ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 16237 మంది (8824 మంది బాలురు, 7413 మంది బాలికలు) ఉన్నారు. అలాగే ఒకసారి పరీక్ష తప్పి పరీక్షకు హాజరవుతున్న వారు 783 మంది(519 మంది బాలురు, 267 మంది బాలికలు) ఉన్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు
ఎన్టీఆర్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పరిశీలించనున్నాయి. ఈ బృందంలో తహసీల్దార్ లేదా డెప్యూటీ తహసీల్దార్, ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పోలీసు ఎస్కార్ట్ ఉంటారని అధికారులు తెలిపారు.
జిల్లా స్టోరేజీ పాయింట్‌గా బిషప్ అజరయ్య హైస్కూల్..
ఎన్టీఆర్ జిల్లా పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజీ పాయింట్‌గా నగరంలోని బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా పరీక్ష కేంద్రాల సమీప పోలీసుస్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరుకోనున్నాయి.
ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్‌ను ఇవ్వటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నో మొబైల్ జోన్‌గా పరీక్ష కేంద్రాలను ప్రకటించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలో 92, నందిగామ డివిజన్ పరిధిలో 38, తిరువూరు డివిజన్ పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


