ప్రజాభిప్రాయ సేకరణలో శ్రీకాకుళం గ్రామస్తులు
శ్రీకాకుళం(ఘంటసాల): ఇసుక రీచ్‌కు అనుమతిస్తే ఉన్న కొద్దినీరు అడుగంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతాయని.. శ్రీకాకుళం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళంలో ఇసుక రీచ్ నిర్వహణకు విజయవాడకు చెందిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీకాకుళం పంచా యతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఈఈ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బందరు ఆర్డీవో సాంబశివరావు అధ్యక్షతన సేకరణ జరిగింది. ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీకాకుళం ఇసుక రీచ్ కార్యనిర్వాహక సంక్షిప్త వివరణ వినిపించారు. స్పందించిన సర్పంచ్ ముప్పనేని రవి ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక రీచ్‌పై పర్యవేక్షణ పంచాయతీకి ఇవ్వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ లంక భూముల్లో పంటలు పండించుకోవడానికి ఇసుక మేటలు తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వని అధికారులు, ఇప్పుడు శ్రీకాకుళం ఇసుక రీచ్‌కు ఎలా అనుమతిస్తారని నిలదీశారు.
లంక భూములను తవ్వేస్తారా!
ఇసుక రీచ్ కొరకు 30 హెక్టార్లు గుర్తించామంటున్న వారు అక్కడ అంతభూమి లేదని వాపోతే లంకభూములను తవ్వేస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతినిధి జేటీ రామారావు మాట్లాడుతూ సొమ్ము శ్రీకాకుళంది, సోకు అమరావతిది అన్న చందాన శ్రీకాకుళం ఇసుకరీచ్ పని ఉందన్నారు. నిబంధనల మేరకు పనులు చేయాలని, ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రీచ్‌కు అనుమతిస్తే ఇబ్బందులు వస్తాయని గ్రామస్తుడు నాగరాజు తెలిపారు. పాపవినాశనం క్వారీపై వైస్ ఎంపీపీ నాగేంద్రబాబు మాట్లాడారు. స్పందించిన ఆర్డీవో సాంబశివరావు పాపవినాశనం ఇసుక క్వారీని మైనింగ్ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎస్‌ఐ వేమన చందన, ఆర్‌ఐ కె.శ్రీనివాస్, వీఆర్వో దగాని గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు.


