ఆత్మకూరు: నాలుగేళ్ల చిన్నారిని శునకం అతి తీవ్రంగా గాయపరిచిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇస్లాంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాషా కుమార్తె హర్షియ మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వస్తుండగా వీధికుక్క వేగంగా వచ్చి బాలికపై దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి చెవి పూర్తిగా తెగిపడింది. తల్లిదండ్రులు బయటకు వచ్చేలోపు చిన్నారిని కుక్క తీవ్రంగా గాయపరిచింది.
వెంటనే కుమార్తెను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, వైద్యులు చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఆత్మకూరు పట్టణంలో కుక్కలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.


