ఇంటా బయటా విమర్శల సుడిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
ఆమెకు చెక్ పెట్టేందుకు మంత్రి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించినట్లు ఊహాగానాలు
ఆమె అనధికార పీఏ, కుమారుడి ఆగడాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం
సోషల్ మీడియాలో మంత్రి కారు డ్రైవర్ పోస్టులపైనా విమర్శలు
ఇటీవల సీఎం పర్యటనకూ ఆమె దూరం
ఈ పరిణామాలతో ఆమె పదవికి ఎసరు ఖాయమంటూ వార్తలు
సాక్షి, పార్వతీపురం మన్యం : కొద్దిరోజుల కిందట రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార పీఏ, కుమారుడు తనపట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. మంత్రికి చెప్పుకున్నా న్యాయం జరగలేదని, పైగా తననే దూర ప్రాంతానికి బదిలీ చేయించారని ఓ మహిళా ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారినా బాధితురాలికి న్యాయం జరగలేదు.
» మంత్రి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరికుమార్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నాడని.. తప్పుడు పోస్టులు పెడుతూ వేధిస్తున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు అధికార్ల నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. గతంలో టీడీపీలో ఉన్న తాను వైఎస్సార్‌సీపీలో చేరానని.. తిరిగి ఆ పార్టీ లోకి తాను చేరనందువల్ల ఇలా క్షోభకు గురిచేస్తున్నారని వాపోయాడు.
» సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డి.శిర్లాం గ్రామానికి చెందిన ఆశ వర్కరు కొద్దిరోజుల కిందట తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మృతిచెందింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. అనారోగ్యం పేరిట విధుల నుంచి తప్పుకోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు చాలా కాలంగా వేధిస్తున్నారు. అందుకు వైద్యాధికారి సహకరించారన్న ఆరోపణలున్నాయి. అయితే, బాధితురాలితో కలిసి తామంతా మంత్రి వద్దకు వెళ్లి వేడుకున్నా ఫలితంలేకపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
» రాష్ట్ర మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చుట్టూ నెలకొంటున్న వివాదాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు కీలక శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న ఆమె తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన నియోజకవర్గంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, లష్కర్లు, కేజీబీవీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపుపై పెద్ద రాద్ధాంతమే జరిగింది.
కొద్దిరోజుల కిందట మంత్రి కాన్వాయ్ రామభద్రపురం వద్ద మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో అటువైపు ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. డ్రైవర్ పూటుగా మద్యం సేవించి వాహనం నడిపాడని ఆ సమయంలో మంత్రి చెప్పారు. వాస్తవానికి.. ఆ వ్యక్తికి అసలు మద్యం తాగే అలవాటేలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరోసారి.. సాలూరు నియోజకవర్గంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనాన్ని మంత్రి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో రాజన్నదొరకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. కనీసం కాన్వాయ్ ఆపకుండానే మంత్రి వెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా.. ఓ ఉద్యోగినిపట్ల ఆమె అనధికార పీఏ వేధింపులు, రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడిపైన మంత్రి కారు డ్రైవరు అసభ్యకర పోస్టులు.. మంత్రి అనుచరులవల్లే తమ అమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఓ యువతి ఆరోపించడం.. ఇలా వరుస వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.
సొంత పార్టీలోనే గుర్రు..
ఇక మంత్రి తీరుతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సొంత పార్టీ నేతలే విసిగిపోతున్నారు. ఆమెకు చెక్ పెట్టేందుకే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడును పట్టుబట్టి అధిష్టానం నియమించిందని ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ నేత భంజ్‌దేవ్ వర్గంతో మొదటి నుంచి ఆమెకు విభేదాలున్నాయి. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతోనూ ఆమెకు పొసగడంలేదని సమాచారం. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్‌కు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి తీరుతో విసిగిపోయిన ఆ ఎమ్మెల్యే మధ్యలోనే లేచి వెళ్లిపోయారట.
ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి ఎక్కడా కనపడలేదు. దీంతో.. సీఎం పర్యటనలో సొంత జిల్లా మంత్రి లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే.. మంత్రి అనుచరుల వేధింపులవల్లే ఇటీవల ఆశ వర్కరు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీని వెనక జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే అంశమై గతంలోనూ ఆ ఎమ్మెల్యే జిల్లా పర్యటనకు వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వద్ద ప్రస్తావించారు. ఇలా.. ఇంటాబయట వివాదాలతో మంత్రి సంధ్యారాణి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. త్వరలో ఆమె పదవికి ఉద్వాసన తప్పకపోవచ్చని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.


