వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
15న జిల్లా స్థాయిలో ర్యాలీలు హోరెత్తాలి
18న గవర్నర్‌కు సంతకాలు అందజేయనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్), జెడ్పీ చైర్‌పర్సన్‌లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్‌చైర్మన్లు , జెడ్పీటీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్‌కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు.


