నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు
డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
పలుచోట్ల ముట్టడికి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే ఒకలా ఉంటారని మండిపాటు
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూడా పట్టించుకోవడంలేదని ఫైర్
చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక.. మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి నెట్‌వర్క్: తమకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలుచేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు శుక్రవారం రోడ్డెక్కారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల కలెక్టరేట్లలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
అంగన్‌వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా పెద్దఎత్తున ధర్నాలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్, నెల్లూరు కలెక్టరేట్ ప్రాంతాలు ధర్నాలతో దద్దరిల్లాయి. మెమొరీ ఎక్కువగా ఉండే 5జీ ఫోన్లు ఇవ్వాలని, 164 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీచేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని, అన్ని యాప్‌లను కలిపి ఒక యాప్‌గా మార్చాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దుచేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు.
ఒంగోలులోనూ మహాధర్నా నిర్వహించారు. మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణం రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, యాప్‌ల పేరుతో పెంచిన పనిభారం తగ్గించాలని, ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం, కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూడా తమను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోనూ ఆందోళన చేశారు. రెండేళ్లకోసారి వేతనాలు పెంచాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా పెంచకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
భారీ ర్యాలీ.. మహా ధర్నా..
ఏలూరులో అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అంగన్‌వాడీలకు మే నెల పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలని, రెండో శనివారం సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని నాయకులు కోరారు. ధర్నా అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఇక తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె చేసేందుకూ సిద్ధమని విశాఖలో ఆందోళనకారులు హెచ్చరించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
1,500 మందితో భారీ ర్యాలీ..
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1,500 మంది భారీ ర్యాలీ చేశారు. అక్కడ అధికారి అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. కలెక్టరేట్‌కు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక లేబర్ కోడ్స్ రద్దుచేయాలని, పెండింగ్‌లో ఉన్న 1,810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని వైఎస్సార్ జిల్లా కడపలో అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు. హెల్పర్ల పదోన్నతులకు, గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. ప్రీ స్కూలు బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలుచేయాలని, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట కూడా అంగన్‌వాడీలు ధర్నాచేసి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
అలాగే, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోనూ వీరు కదం తొక్కారు. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వర్కర్లను నాల్గవ తరగతి ఉద్యోగులుగా.. హెల్పర్లను మూడో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా కొత్త అంగన్‌వాడీ సెంటర్లు తీసుకురావాలన్నారు. ప్రతీనెలా 5 నుంచి 7 వరకు సమావేశాలకు పిలుస్తున్నారని.. టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ జీతాలు, బిల్లులు సకాలంలో ఇవ్వాలని కోరారు. మరోవైపు.. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్లను కూడా అంగన్‌వాడీలు ముట్టడించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా ఉంటారని మండిపడ్డారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక అని, తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వసతుల్లేని అద్దె భవనాల్లో పాఠశాలల నిర్వహణ కష్టంగా ఉందన్నారు.


