పొందూరు: ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ పరిశ్రమకు విశేష గుర్తింపు లభించింది. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ప్రకటిస్తూ వాణిజ్య, పరిశ్రమలశాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం అధికారిక పత్రాన్ని జారీచేసింది. 2020 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పొందూరు ఖాదీ ఉన్నతికి విశేషంగా కృషి చేసింది. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది.అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది.
ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చేవిధంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజి్రస్టేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999ను రూపొందించారు. ఈ చట్టం కింద ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వర్తిస్తుంది.
ఇందుకోసం భౌగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని అన్నిదశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణనలోకి తీసుకుంటుంది. పొందూరు ఖాదీకి జీఐ టాగ్ లభించడం వెనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో విశేష కృషిచేసింది.
జీఐ టాగ్ నంబర్ 1049: పొందూరు ఖాదీకి జీఐ టాగ్ నంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భోగోళిక సూచికల రిజిస్ట్రీ ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని వెలువరించింది. ఇంతవరకు బాస్మతి బియ్యం, డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, నిర్మల్ బొమ్మలు, మైసూరు శాండిల్ సబ్బుతో పాటు పొందూరు ఖాదీ కూడా ఆ జాబితాలో చేరింది.


