ఆగని అప్పుల పరుగు.. బాబు గారి లిక్కర్‌ బాండ్లు | Unstoppable debt run of chandrababu naidu in form of Liquor Bonds | Sakshi
Sakshi News home page

ఆగని అప్పుల పరుగు.. బాబు గారి లిక్కర్‌ బాండ్లు

Dec 13 2025 4:20 AM | Updated on Dec 13 2025 4:20 AM

Unstoppable debt run of chandrababu naidu in form of Liquor Bonds

ఎక్సైజ్‌ బాండ్ల రూపంలో రూ.5,490 కోట్ల రుణం

రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు 

బాండ్ల జారీపై జీవో లేదు.. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం 

ఏకంగా 9.15 శాతం అత్యధిక వడ్డీ రేటు 

నాడు తక్కువ వడ్డీతో తక్కువ అప్పులు చేసినా శ్రీలంక అయిపోతుందని యాగీ.. 

సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు 

18 నెలల్లోనే బాబుగారి అప్పులు రూ.2,66,175 కోట్లు 

ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులలో 80 శాతం 18నెలల్లోనే దాటేసిన బాబు.. 

ఎక్కువ అప్పులే కాదు వేగంగా అప్పులు చేయడంలోనూ బాబుగారే టాప్‌ 

2014–19లో అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) 22.63 శాతం 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇది 13.57శాతం మాత్రమే.. 

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితినీ ఎప్పుడో దాటేసిన బాబు ప్రభుత్వం.. 

ఇలాగైతే ఏపీ పరిస్థితి శ్రీలంక కాదు సౌత్‌ సూడానే అంటున్న ఆర్థిక నిపుణులు

సాక్షి, అమరావతి: ఎడాపెడా అప్పులు చేయడంలో ఎన్నో డిగ్రీలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్న చంద్రబాబు సర్కార్‌... ఇప్పుడు రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో భారీ అప్పు చేసింది. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెడుతూ ఎక్సైజ్‌ బాండ్ల ద్వారా ఏకంగా రూ.5,490 కోట్ల అప్పు సేకరించింది. బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బాండ్ల సేకరణ జరిగింది. 

అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన అప్పులతో కలిపి) చేరుకున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నట్లు శుక్రవారం పొద్దుపోయిన తర్వాత వెల్లడించారు. 

ఇవన్నీ సరిపోవన్నట్లు మళ్లీ చంద్రబాబు పదేపదే అప్పులకు అర్రులు చాస్తుండడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ 18 నెలల్లోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80శాతాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాటేసిందంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 

తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తేనే వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రం దివాళా తీస్తోందని, శ్రీలంక అయిపోతోందని పెడ»ొబ్బలు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు అధిక వడ్డీలకు చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే రాష్ట్రం ఏమౌతుందని శ్రీలంక అవుతున్నట్లా.. లేక సౌత్‌ సూడాన్‌ అవుతున్నట్లా.. అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

అధిక వడ్డీతో రూ.5,490 కోట్ల రుణం 
రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిని హామీగా చూపిస్తూ భారీ రుణ సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎక్సైజ్‌ శాఖ బాండ్లను జారీ చేయడం ద్వారా  రూ.5,490 కోట్ల అప్పు చేశారు. అది కూడా త్రైమాసికానికి అత్యధికంగా 9.15శాతం వడ్డీతో బాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు. 

గుట్టుచప్పుడు కాకుండా ఈ భారీ రుణం సేకరించారు. 9.15శాతం వడ్డీ రేటుతో బాండ్లను జారీ చేసి రుణాన్ని సేకరిస్తున్నారన్న విషయం బయటకు పొక్కితే ఆరి్థక నిపుణులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తారన్న కారణంవల్లే దీనిని గోప్యంగా ఉంచారు.  

ఎంత తాగిస్తే.. అన్ని అప్పులు.. 
‘మద్యం అమ్మకాలు పెంచండి.. ఈ ఏడాది రూ.35వేల కోట్ల రాబడి తేవాలి..’ అని సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. ఊరూవాడా బెల్టు షాపులు పెరిగిపోతున్నా, ఎక్కడబడితే అక్కడ పర్మిట్‌ రూమ్‌లు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనడం లేదు. 

వీటి వెనక ఉన్న మర్మం ఇపుడు అందరికీ బోధపడింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే తమకు అంత సంతోషం అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం. ఎందుకంటే మద్యం విక్రయాలపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్‌లో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 5,490 కోట్ల రుణం సేకరించారు. 

దీనినిబట్టి రాబోయే రోజుల్లో అనివార్యంగా మద్యం ఆదాయాన్ని భారీగా పెంచాల్సి ఉంటుంది. 2024–25లో మద్యం విక్రయాల ద్వారా రూ.24వేల కోట్ల రాబడి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మద్యం విక్రయాల ద్వారా పన్నుల ఆదాయం రూ.35 వేల కోట్లకు చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. 

తరువాత ఏడాది మరింతగా అంటే రూ.50వేల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అంటే ప్రస్తుత మద్యం విక్రయాలను ఏకంగా 100శాతం పెంచాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టమవుతోంది. ఎంతగా మద్యం తాగిస్తే...తాము అంతగా అప్పులు చేయడానికి వీలౌతుంది అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు.  

నిబంధనలకు విరుద్ధంగా.. అధికవడ్డీకి... 
ఎక్సైజ్‌ బాండ్ల ద్వారా రుణ సేకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఎప్పుడో దాటిపోయింది. అయినా సరే ఎక్సైజ్‌ బాండ్ల ద్వారా రూ.5,490 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 9.15శాతం చొప్పున అత్యధిక వడ్డీకి కూడా వెనకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులంటున్నారు. 

ఎందుకంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ఎస్‌డీఎల్‌ (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌) రూపంలో రుణసేకరణ జరిగితే అందుకు వర్తించే వడ్డీ భారం 6.5 శాతం లోపే ఉంటుంది. కానీ అత్యధిక వడ్డీ రేట్లతో ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుండటం సందేహాస్పదంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీస్తుందని అంటున్నారు.  నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తున్నా శ్రీలంక అయిపోతుందని విమర్శించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ వడ్డీకి ఎక్కువ అప్పులు చేస్తుండడాన్ని ఎలా సమర్థించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

నాడు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం
నాడు వైఎస్‌ జగన్‌ హయాంలో మద్యం ఆదాయంపై రుణాలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి రుణం ఇవ్వవద్దని జాతీయ బ్యాంకులు, స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టు పెట్టేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. 

ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల పేరుతో హైడ్రామా సృష్టించి అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌లకు ఎగనామం పెట్టేశారు.

బాబుగారి అప్పులు చూస్తే..  శ్రీలంక కాదు సౌత్‌ సూడానే..  
2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లు.

 అంటే జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పుల్లో 80శాతం అప్పులు ఈ 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసేసిందన్నమాట. రానున్న 42 నెలల్లో ఈ లెక్కన అప్పులు చేసుకుంటూ పోతే... శ్రీలంక సంగతి దేవుడెరుగు.. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సౌత్‌సూడాన్‌ కన్నా ఆంధ్రప్రదేశ్‌ దిగజారిపోవడం ఖాయమని ఆరి్థక నిపుణులంటున్నారు. 

అప్పుల వేగంలో బాబుగారికి సరిలేరెవ్వరూ.. 
రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు అన్నీ కలుపుకుంటే రూ.1,40,717 కోట్లుగా ఉన్నాయి. ఆ అప్పులు కాస్తా 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి  రూ. 3,90,247 కోట్లకు ఎగబాకాయి. దానర్థం చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ. 2,49,350 కోట్లు. 

చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) 22.63శాతంగా ఉంది. అదే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 3,90,247 కోట్లు ఉన్న అప్పులు ఐదేళ్ల కాలంలో రూ. 7,21,918 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఐదేళ్ల కాలంలో జగన్‌  ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 3,32,671 కోట్లు. అప్పుల సీఏజీఆర్‌ 13.57 శాతం మాత్రమే కావడం గమనార్హం. 

కానీ చంద్రబాబు సీఏజీఆర్‌ మాత్రం 22.63శాతంగాఉంది. 2014–19లో అధిక వడ్డీలకు అధిక అప్పులతో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఇపుడు జగన్‌ ఐదేళ్లలో చేసిన అప్పులలో 80శాతం అప్పులను ఈ 18 నెలల కాలంలోనే అధిగమించి రాష్ట్రాన్ని సౌత్‌ సూడాన్‌ దిశగా నడిపిస్తుండడం ఆందో­ళనకరమని ఆరి్థక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

రాష్ట్ర విభజన నాటి నుంచి 2024 మార్చి 31 వరకు అప్పుల వివరాలు ఇవీ...

కాగ్, రాష్ట్ర బడ్జెట్‌ కాపీలు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు 1,40,717 కోట్లు కాగా, 2014 నుంచి 2019 మార్చి 31వరకు ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,49,350 కోట్లు అప్పు చేసింది. ఆ ఐదేళ్లలో పెరిగిన అప్పులు 22.63 శాతం. అదే జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, పెరిగిన అప్పు కేవలం 13.57 శాతమే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement