సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణలోనూ ఏపీ టీడీపీ నేతల ఇసుక దందా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. లారీలు, టిప్పర్లలో ఏపీ ఇసుక.. తెలంగాణ సరిహద్దు దాటుతోంది.
పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా అక్రమ రవాణా సాగుతోంది. లారీలు, టిప్పర్లపై ఇసుక కనబడకుండా టార్పలిన్ కవర్లు కప్పి మరీ టీడీపీ ముఠాలు.. ఇసుకను రవాణా చేస్తున్నారు. సరిహద్దులో ఎలాంటి చెక్ పోస్టులు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక లారీలు సాక్షి టీవీ కెమెరాకు చిక్కాయి.
గత నెల(నవంబర్)లో ఏపీలోని కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రక్కిలంకలో ఉన్న ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు 200కు పైగా లారీల్లో ఇసుకను అక్రమార్కులు తరలించారు. ప్రక్కిలంక ర్యాంపు నుంచి గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణలోని అశ్వారావుపేటలోకి ప్రవేశించిన మూడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అడ్డుకని 105 టన్నుల ఇసుకను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
చింతలపూడి మీదుగా సత్తుపల్లికి తరలించి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబ్‌నగర్, గద్వాల్ జిల్లాలో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23న దమ్మపేట మండలం నాగుపల్లిలో ఇదే తరహాలో వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.


