విశాఖపట్నం: నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వ.జమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా? అని నిలదీశారు. కేవలం ఏపీలోనే రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు.
ఈ రోజ(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్.. ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చిందన్నారు.
నాడు జగన్ ఏం చెప్పారో.. చంద్రబాబు అదే చెబుతున్నారు
విశాఖ గురించి నాడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చెప్పారో.. నేడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారని, ఇప్పుడు అదే మాట చంద్రబాబు కూడా చెబుతున్నారన్నారు. 2014లో విశఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారన్నారు. ‘ రాష్ట్రానికి పరిశ్రమల రావడం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్..ిశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖ వచ్చింది కాబట్టి మిగతా ఐటీ పరిశ్రమలు విశాఖ నగరానికి తరలివస్తున్నాయి.
టిసిఎస్ విశాఖ రావడానికి జగన్ కృషి ఉంది. పెద్ద కంపెనీలకు భూమి ఇవ్వడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్ట బేడుతున్నారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారు?, మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికి ఇస్తామంటే ఎలా..?, సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారు?,
రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి తక్కువ రేటుకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు ఇస్తారా?, లులు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొంటారు. మన రాష్ట్రంలో నామమాత్రపు ధరకు కట్టబెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు. లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదు.
వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాశారు. చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటూ వార్తలు రాస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ తో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారు.. నేడు ప్రకటనల్లో మోడీ పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయి’ అని విమర్శించారు.


