సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్‌కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్‌ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు.
..ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది.
..ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్‌షీట్‌లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు.
..టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్‌కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు.


