నాబార్డు నుంచి తీసుకునే ఈ అప్పునకు ప్రభుత్వం గ్యారెంటీ
హామీ ఇచ్చిన మొత్తంపై 5 శాతం గ్యారెంటీ ఫీజు సీఆర్‌డీఏ చెల్లించాలి
ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
దీంతో రాజధాని అప్పులు రూ.47,387.70 కోట్లకు చేరిక
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కారు చేస్తున్న అప్పులు ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నారు. నాబార్డు నుంచి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్‌డీఏ) తీసుకునే రూ.7,387.70 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఆర్‌డీఏ రుణ సంస్థకు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఆరి్థక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వ హామీ, లెటర్ ఆఫ్ కంఫర్ట్ పొందేందుకు అనుమతించింది. హామీ ఇచి్చన మొత్తంపై 5 శాతం గ్యారెంటీ ఫీజును సీఆర్‌డీఏ చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది. దీంతో రాజధాని కోసం చేసిన మొత్తం అప్పులు రూ.47,387.70 కోట్లకు చేరాయి.
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ చంద్రబాబు ప్రచారం...
రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం భారీగా అప్పులు తెస్తున్నారు. మరోపక్క బడ్జెట్ నుంచి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అప్పులు తేవడంతోపాటు బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుందో సీఎం చంద్రబాబుకే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


