మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలోకి ప్రైవేటు బస్సు బోల్తా.. 9మంది దుర్మరణం
తులసిపాక వద్ద ఘోర ప్రమాదం
22 మందికి తీవ్ర గాయాలు
మరో ఆరుగురికి స్వల్ప గాయాలు
చిత్తూరు నుంచి ఈ నెల 6న 37 మందితో తీర్థయాత్రలకు బయల్దేరిన బస్సు
అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఘటన
డ్రైవర్ అతివేగం, దట్టమైన పొగమంచు కారణంగా కనిపించని రోడ్డు
మలుపులో బస్సు వేగాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్
ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయిన బస్సు
నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్న యాత్రికులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.

రాజుగారి మెట్ట వద్ద..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది.
మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్‌కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్‌కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు.
22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.
పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..
చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు.
తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది.
కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు.
తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మృతుల వివరాలు
మృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.

అతివేగం.. పొగమంచే కారణం
బస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్‌రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు.
బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.
తీరిగ్గా.. తాపీగా..
ఈ ఘాట్‌రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్‌రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
గత సంక్రాంతి సీజన్‌కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు విచారం
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులే
చిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్‌రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్‌తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు.
చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు.
బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది.
తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది.
టూర్‌లో అరకు లేకపోయినా..
ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.
బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది.
పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్‌ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.
‘ఫిట్‌నెస్ ఎలా ఇచ్చారో’
ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్‌నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్‌లో ఎఫ్‌సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్‌సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్‌సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.
డ్రైవర్ల వివరాలు ఇలా..
బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ
కూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు
భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్
దుర్ఘటనలో కదిలించే ఉదంతాలు
నేను పోయి వాళ్లు బతికినా బాగుండేది...
‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్‌రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారి
హెల్పర్‌గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు
మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్‌గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్
బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు...
బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్
తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం
తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజ
మమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు
మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్
మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు
మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి
– చింతూరు/మోతుగూడెం


