కిలోమీటర్‌కు రూ.180.35 కోట్లు | The contract value for the works to connect the access road with NH16 | Sakshi
Sakshi News home page

కిలోమీటర్‌కు రూ.180.35 కోట్లు

Dec 13 2025 5:05 AM | Updated on Dec 13 2025 5:05 AM

The contract value for the works to connect the access road with NH16

ఇదీ యాక్సిస్‌ రోడ్డును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువ

రూ.511.84 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ 

4.05% ఎక్సెస్‌తో రూ.532.57 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎన్‌సీసీ 

ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోద ముద్ర.. దాంతో ఖజానాపై అదనంగా రూ.20.73 కోట్ల భారం

పన్నుల రూపంలో మరో రూ.98.66 కోట్లు రీయింబర్స్‌.. దాంతో కాంట్రాక్టు విలువ రూ.631.23 కోట్లు

3.5 కి.మీ. పొడవునా 6 వరుసలతో రోడ్డు నిర్మాణం.. ఇందులో 2.4 కి.మీ. మేర ఆర్వోబీ ఎలివేటెడ్‌ కారిడార్‌

సాక్షి, అమరావతి: అమరావతిలో భవనాలు, రోడ్లు నిర్మాణ పనుల కాంట్రాక్టులను అడ్డగోలు వ్యయాలకు కట్టబెట్టడంలో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌­మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) తాము నెలకొల్పిన రికార్డులను తామే బద్దలుకొడుతున్నాయి. 

తాజాగా సీడ్‌ యాక్సిస్‌ (ఈ3) రోడ్డును ఎన్‌హెచ్‌–16 (కోల్‌­కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులను కిలోమీటరుకు రూ.180.35 కోట్లకు అప్పగించేందుకు ఏడీసీఎల్‌కు చంద్రబాబు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఈ మేరకు జీవో ఆర్‌టీ నం.1471 జారీ చేసింది.  

» కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్‌పైన మణిపాల్‌ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ.–21.770 కి.మీ.), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో అక్టోబర్‌ 27న ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. లంప్సమ్‌ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్‌) పేర్కొంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది. 

» 2.464 కి.మీ. ఆర్వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) ఎలివేటెడ్‌ కారిడార్‌... 99.6 మీటర్లు ఆర్వోబీ, రెండు అండర్‌ పాస్‌లు, ఒక ఇంటర్‌చేంజ్‌ (ట్రంపెట్‌), మైనర్‌ బ్రిడ్జి కమ్‌ పప్, 3 ర్యాంప్‌లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు) నిర్మించాలి. ఈ ప్రకారం కి.మీ. రోడ్డు, ఆ­ర్వో­బీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా (రీయింబర్స్‌మెంట్‌ మినహా) నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. 

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినా..
నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీ­య రహదారులను నిరి్మస్తోంది. విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–65)లో అంత­ర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు అత్యద్భుత డిజైన్‌తో కనకదుర్గమ్మ ప్లైఓవర్‌ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలతో రూ.­282.4 కోట్లతో 2020లో పూర్తి చేసింది. 

అంటే.. కిలోమీటరుకు వ్యయం రూ.108.61 కోట్లు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య తీర్చేందుకు బెంజ్‌ సర్కిల్‌ వద్ద మూడు వరుసలతో 2020 నాటికి 2.35 కి.మీ. మొదటి ప్లైఓవర్‌ను రూ.80 కోట్లతో, 2.47 కి.మీ. రెండో ప్లైఓవర్‌ను మూడు వరుసలతో 2021­లో రూ.88 కోట్లతో పూర్తి చేసింది. 

ఈ ప్రకారం ఆరు వరుసలతో ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ విధానంలో రహదారి నిర్మాణానికి కి.మీ.కు రూ.69.70 కోట్లను ఎన్‌హెచ్‌ఏఐ ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ, అచ్చం ఇదే పద్ధతిలో నిరి్మస్తున్న సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును కాంట్రాక్టు సంస్థకు కి.మీ.కు రూ.180.35 కోట్ల చొప్పున అప్పగిస్తుండడం గమనార్హం.   

రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి ఉంటే.. 
రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్‌ అంచనా వ్యయాలను పెంచేస్తూ.. అస్మదీయులకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేష­న్‌ జారీ చేస్తూ అధిక ధరకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టింది. ఖజానాను కొల్లగొడుతూ నీకింత నాకింత అంటూ పంచుకునేలా టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానం, మొబిలైజేషన్‌ అడ్వాన్సు రద్దు వంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు మళ్లీ జీవం పోసింది. 

అయితే, 2024లో చంద్రబాబు సర్కార్‌ వచ్చాక 2014–19 మధ్య తరహాలోనే అస్మదీయులకు అధిక ధరలకు పనులు కట్టబెట్టేందుకు జ్యుడీíÙయల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌­ను రద్దు చేసింది. మొబిలైజేషన్‌ అడ్వాన్సులను మళ్లీ తెచి్చంది. జ్యుడీíÙయల్‌ ప్రివ్యూ అమల్లో ఉంటే.. సీడ్‌ యాక్సిస్‌(ఈ3) రోడ్డును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మేధావులు, సాధారణ ప్రజలు ఆన్‌లైన్‌లో ఆధారాలతో అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉండేది. 

వీటిని పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు విలువను సవరించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆదేశించే వీలుండేది. రివర్స్‌ టెండరింగ్‌ అమల్లో ఉంటే... ఏడీసీఎల్‌ నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే కనీసం 9–10 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారు. తద్వారా ఖజానాకు భారీఎత్తు­న ఆదా అయ్యేది. కానీ, చంద్రబాబు సర్కార్‌ ఆ విధా­నాలను రద్దు చేయడంతో సీడ్‌ యాక్సిస్‌ (ఈ3) రోడ్డును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువ భారీగా ఉంది. 

రివర్స్‌ టెండరింగ్‌ రద్దుతో... 4.05 శాతం అధిక ధరకు రూ.532.57 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దీనికే పనులు అప్పగించడానికి గురువారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  అనంతరం ఏడీసీఎల్‌కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనులు కేటా­యించడంతో ఖజానాపై అదనంగా రూ.20.73 కో­ట్లు భారం పడింది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానించే రహదారి పనుల కాంట్రాక్టు విలువ కి.మీ.కు రూ.180.35 కోట్లకు చేరింది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకెన్ని కోట్లకు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంజనీరింగ్‌ నిపుణుల విస్మయం 
జాతీయ రహదారుల నిర్మాణం.. కనకదుర్గమ్మ, బెంజ్‌ సర్కిల్‌ ప్లైఓవర్‌ నిర్మాణ వ్యయాలతో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజనీరింగ్‌ నిపుణులు నివ్వెరపోతున్నారు. నేషనల్‌ హైవేలు, అంతర్భాగమైన భారీ ప్లైఓవర్ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ... ‘‘సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును తారు, కాంక్రీట్‌తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా?’’ అని ఇంజినీర్లు, జాతీయ రహదారుల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నీకింత.. నాకింత పంచుకోవడానికే
కాంట్రాక్టు విలువను భారీగా పెంచడం వెనుక... ఆ అంచనా వ్యయాన్ని కాంట్రాక్టర్‌తో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత, కాంట్రాక్టు సంస్తలు పంచుకుతినడానికేనని ఇంజనీరింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్‌డబ్ల్యూ(జర్మనీ), హడ్కో వంటి అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకుతింటూ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement