జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ప్రైవేట్ షిప్‌యార్డ్‌కు చంద్రబాబు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులు వేట కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్‌లోనూ ప్రైవేట్ సంస్థ పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరిట ప్రైవేట్‌కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు షిప్‌యార్డ్ నిర్మాణం పేరిట ఫిషింగ్ హార్బర్‌లోకి సైతం ప్రైవేట్ సంస్థకు రెడ్‌కార్పెట్ వేసింది.
మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు 29.58 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలవేట కోసం నిర్దేశించిన ఫిషింగ్ హార్బర్ల వద్ద షిప్‌యార్డు నిర్మిస్తే మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జగన్ నిర్మించారు.. చంద్రబాబు ప్రైవేట్‌కు ఇస్తున్నారు
రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్‌గా ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అక్కడ షిప్‌యార్డ్ నిర్మించేందుకు సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు 29.58 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సాగర్ డిఫెన్స్ సంస్థ ఆటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మార్కెట్ విలువలో 6 శాతం అద్దె చెల్లించే విధంగా ఈ భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 5 శాతం చొప్పున లీజు ధరను పెంచుతామని తెలిపారు. అదే 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్‌పై 50 శాతం అదనపు ప్రీమియం విధిస్తామని, ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


