బావమరిది కళ్లల్లో ఆనందం కోసం.. | Arogyasri ends FIFO policy in payments to Nandamuri Balakrishna Hospital | Sakshi
Sakshi News home page

బావమరిది కళ్లల్లో ఆనందం కోసం..

Mar 16 2026 5:04 AM | Updated on Mar 16 2026 5:04 AM

Arogyasri ends FIFO policy in payments to Nandamuri Balakrishna Hospital

బాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’

కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శకతకు పాతర 

నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో విధానానికి స్వస్తి 

గతేడాదే గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ 

నిబంధనలకు తూట్లు పొడిచి రూ.కోట్ల చెల్లింపులు

బకాయిల కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు రోడ్లెక్కినా పట్టించుకోని ప్రభుత్వం

చంద్రబాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలిచ్చింది జనం కోసం కాదని.. తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం.. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో పెద్దపీట వేశారు. ఇందుకోసం గతేడాది చీకటి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. 

ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు తరచూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా.. సమ్మెబాట పడుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కానీ.. బాలకృష్ణ ఆస్పత్రికి మాత్రం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు చెల్లించడం బాబు బంధుప్రీతికి అద్దం పడుతోంది.

సాక్షి, అమరావతి: అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించనని దైవసాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు.. పాలనలో అడుగడుగునా పక్షపాతం, రాగద్వేషాలు కనబరుస్తున్నారు. సొంత ప్రయోజనాలు, అయినవారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. 

ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.3 వేల కోట్లకు పైగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపే బసవతారకం ఆస్పత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ‘ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ఔట్‌ (ఫిఫో)’ విధానానికి తిలోదకాలిచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గతేడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. 

రూ.50 కోట్ల వరకు చెల్లింపు 
నిబంధనల ప్రకారం ఏ ఆస్పత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో..  చెల్లింపుల్లో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇలా ఏ ఆస్పత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే.. బసవతారకం ఆస్పత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో నిబంధనలను సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందించే సంస్థలు, టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆస్పత్రికి చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

కేవలం బసవతారకం ఆస్పత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్‌ బాలకృష్ణ ఆస్పత్రికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కిన నాటినుంచే బసవతారకం ఆస్పత్రికి అక్రమ విధానంలో బిల్లు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలున్నాయి.  

ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో బసవతారకం ఆస్పత్రికి ఫిఫో నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ వైద్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులు   

ముఖ్యనేత ఆదేశాలతో.. 
గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఈవోగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్‌ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోనని చెప్పడంతో ఆ పంచాయితీ ముఖ్యనేత కార్యాలయానికి చేరింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిమ్‌ల పరిశీలన, బిల్లులు అప్‌లోడ్‌ చేయడం, నిధులు విడుదలలో బాలకృష్ణ ఆస్పత్రికి రెడ్‌కార్పెట్‌ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆస్పతికి ఇవ్వడం ఏంటని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యజమానులు వాపోతున్నారు. 

అనేక ఆస్పత్రులు ఉన్నా.. 
వాస్తవానికి రాష్ట్రంలో బసవతారకం తరహాలోనే ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, రాజమండ్రిలో జీఎస్‌ఎల్‌ కేన్సర్‌ ట్రస్టు, విశాఖలో లయన్స్‌ కేన్సర్‌ హాస్పిటల్, పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇలా అనేక ట్రస్టు/మిషన్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. బసవతారకం ఆస్పత్రి కూడా అలాంటిదే అయినా.. కేవలం తన బావమరిది నడిపే ఆస్పత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపుల్లో అవాంతరాలు లేకుండా చేస్తున్నారని విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement