రైళ్ల భద్రత కోసం ప్రత్యేక సెన్సార్లు తయారు చేసే యంత్రం
విద్యుత్ రంగ అభివృద్ధికి ‘ఆర్‌ఆర్ కాట్’ పరిశోధనలు
అణు విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర
అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను రూపొందించిన కేంద్రం
మెటల్ 3డీ ప్రింటింగ్ సాంకేతికతపై పని చేస్తున్న స్టార్టప్‌తో సహా 32 పరిశ్రమలకు చేయూత
రైలు ప్రమాదాల నివారణ, పర్యవేక్షణకు ప్రత్యేక సెన్సార్ వ్యవస్థపై అధ్యయనం
విశాఖలోనూ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కార్యకలాపాలు
‘సాక్షి’తో ఆర్‌ఆర్ కాట్ డైరెక్టర్లు జిష్ణు ద్వివేది, క్రైస్ట్ ప్రకాష్ పాల్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఆర్‌ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది.
సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్‌ఆర్‌క్యాట్‌లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి
దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్‌ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్ కాట్‌లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి.

ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ
విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్‌ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్‌ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది.
ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్‌ఆర్ కాట్‌లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి.
విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి.


