అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం | Two farmers commit suicide due to increasing pressure from lenders | Sakshi
Sakshi News home page

అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం

Mar 16 2026 4:48 AM | Updated on Mar 16 2026 4:48 AM

Two farmers commit suicide due to increasing pressure from lenders

రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇద్దరు రైతుల ఆత్మహత్య 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం 

ఎమ్మిగనూరురూరల్‌/గుంతకల్లు రూరల్‌: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో వైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పులు  తీర్చే మార్గం లేక .. 
అవమానాలు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. 

తిమ్మాపురంలో..: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామానికి చెందిన బీజీ అశోక్‌(28) నాలుగు ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. పంటలు, ఇంటి ఖర్చుల కోసం రూ. 9.50 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం అశోక్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు చెప్పారు.  

గుంతకల్లులో..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సంతోష్ నగర్‌లో ఉంటున్న కురుబ రామిరెడ్డి(53) వ్యవసాయం కలిసి రాక..  అప్పులు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...కర్నూలు జిల్లా హాలహర్నికి చెందిన కురుబ రామిరెడ్డి వ్యవసాయం కోసం దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేశారు. తీర్చే మార్గం కానరాక ఐదేళ్ల కిందట గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌కు చేరుకున్నాడు. భార్య సుజాత, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. 

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులోళ్ల నుంచి వేధింపులు పెరిగిపోవడంతో దిక్కుతోచని రామిరెడ్డి ఈ నెల 12న అర్ధరాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement