ఖాకీలా.. కిడ్నాపర్లా! | TDP Conspiracy on YSRCP Corporators Kidnapping: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఖాకీలా.. కిడ్నాపర్లా!

Dec 13 2025 5:26 AM | Updated on Dec 13 2025 5:26 AM

TDP Conspiracy on YSRCP Corporators Kidnapping: Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు సొంతగూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు

పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు

నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్‌ కుమారుడి కిడ్నాప్‌ 

రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీస్‌స్టేషన్లు తిప్పుతూ వేధింపులు

తీవ్రంగా కొట్టి, భయపెట్టి.. టీడీపీకి జై కొట్టించడంలో కీలక పాత్ర 

పొరపాటుగా వెళ్లామని.. టీడీపీలోనే కొనసాగుతామని తెల్లారేసరికి వీడియో రిలీజ్‌

ఆ ఇద్దరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పి టీడీపీ నేతలకు అప్పగించిన వైనం

పోలీసుల బరితెగింపుపై సర్వత్రా విస్మయం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తు­న్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాం­గాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బీఫారంపై గెలిచిన కార్పొ­రేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.

అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారా­యణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.

వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్‌ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్‌ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు.  

కేసుల పేరుతో అదుపులోకి..
నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్‌ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

తాడేపల్లి నుంచి అదృశ్యం
నెల్లూరు కార్పొరేషన్‌లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్‌లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్‌ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్‌ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్‌లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.

కేసులు.. అరెస్ట్‌ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్‌నకు చేర్చారు
వైఎస్సార్‌సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్‌ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్‌ తనయుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్‌ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.

నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్‌నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికార పార్టీ నేతల క్యాంప్‌లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్‌ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement