ఒకటి కాదు.. రెండు కాదు.. వంద సింక్‌హోల్స్ (భారీ గుంతలు) ఏర్పడ్డాయి. అది కూడా ఈ మధ్య కాలంలోనే!. గ్రామం చుట్టూ.. కొన్ని ఇళ్ల పక్కనే ఈ గుంతలే కనిపిస్తున్నాయి. సింక్‌హోల్స్ తమ పొలాలను ఎక్కడ మింగేస్తాయోనని అక్కడి ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు. ఆ ప్రాంతం సురక్షితమని ఏ సైంటిస్టు కూడా చెప్పలేకపోతున్నారు. ఇది టర్కీ(తుర్కియే) ధాన్యాగారంగా పేరున్న కోన్యా రీజియన్ పరిస్థితి.
సెంట్రల్ అనాటోలియాలోని కోన్యా రీజియన్ ప్రధానంగా గోధుమ, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతానికి బ్రెడ్‌బాస్కెట్ అనే పేరు ముద్రపడింది. అయితే ఈ ఊరిని.. పంట పొలాలను భారీ గుంతలు మింగేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 684 గుంతలు(బుధవారం నాటికి) ఏర్పడ్డాయి అక్కడ. ఈ మేరకు AFAD (Turkey Disaster Agency)గుర్తించిన ఆ గుంతల కొన్ని డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎలా ఏర్పడ్డాయంటే..
భూగర్భ జలాల అధిక వినియోగం.. దశాబ్దాలుగా సాగు కోసం అధికంగా నీటిని పంపింగ్ చేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఉంది. దీనికి తోడు విపరీతమైన కరువు, వాతావరణ మార్పులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. ఇక్కడి భూగర్భ శిలల స్వభావం కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. కార్బోనేట్, జిప్సం రాళ్లతో కూడిన "కార్స్ట్" భూభాగం. దీంతో.. సహజంగా గుహలు, ఖాళీలు ఏర్పడేలా ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు నేలల స్వభావం కూడా ఇలాంటి గుంతలు ఏర్పడడానికి కారణమైంది.

ఈ ప్రభావంతో.. భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో అది 60 మీటర్ల వరకు తగ్గాయి. సుమారు 30 మీటర్ల లోతైన గుంతలు పొలాలు, రహదారులు, నిర్మాణాలను మింగేస్తున్నాయి. రైతులు ప్రమాదకరమైన పొలాలను వదిలిపెట్టాల్సి వస్తోంది. శాస్త్రవేత్తలు సింక్‌హోల్ హాట్‌స్పాట్‌లను మ్యాప్ చేస్తున్నారు, భవిష్యత్తులో మరింత కుంగిపోవడం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.
సాధారణ విషయమే కానీ..
కొన్యా మైదానంలో సింక్‌హోల్స్ ఏర్పడడం కొత్తదేం కాదు. నేల స్వభావంతో అప్పుడప్పుడు(పదేళ్లకో.. పాతికేళ్లకో..) చిన్న చిన్న గుంతలు ఏర్పడేవి. అదీ సహజ ప్రక్రియలో నెమ్మదిగా కుంగిపోయేది. ఇప్పుడేమో వాతావరణ మార్పులు.. దీర్ఘకాలిక కరువు ఫ్లస్ అధిక భూగర్భ జల వినియోగం కారణంగా శరవేగంగా, పెద్ద సంఖ్యలో సింక్‌హోల్‌లు ఏర్పడుతున్నాయి. ఫలితంగా.. రైతుల పొలాలు, రహదారులు, చుట్టుపక్కల గ్రామాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.
Nearly 700 sinkholes have appeared in parts of Turkey, with new ones showing up, fueled by extreme drought. pic.twitter.com/AaSdD3YNap
— AccuWeather (@accuweather) December 12, 2025
అన్ని రకాల నష్టాలు..
కొన్యాలో తాజాగా ఏర్పడిన గుంతలు సాధారణమైనవేం కాదు. రైతుల జీవనోపాధి, గ్రామాల భద్రత, పర్యావరణ సమతుల్యత అన్నీ ఈ ప్రభావంతో కుదేలవుతున్నాయి. సుమారు 100 అడుగుల లోతు దాకా ఉంటున్నాయి. ఇవి గోధుమ, మొక్కజొన్న, బీట్ వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రతి గుంత సగటున 1–3 హెక్టార్ల పొలాన్ని మింగేస్తోంది. అంటే కనీసం 700–2000 హెక్టార్లు పంట భూమి నష్టపోయింది. పొలాలు వదిలిపెట్టాల్సి రావడం వల్ల రైతులు ఆదాయం కోల్పోతున్నారు. పైగా ఈ కుంగుబాటుతో చుట్టుపక్కల భూములు కూడా నిస్సారంగా మారుతున్నాయి. రహదారులు, చుట్టుపక్కల ఉండే జనావాసాలు దెబ్బతింటున్నాయి. కొ ప్రమాదకర ప్రాంతాల నుంచి కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

భూగర్భ జలాలు 60 మీటర్ల వరకు తగ్గిపోవడం వల్ల సహజ సమతుల్యత దెబ్బతింది. టర్కీ గత 50 ఏళ్లలో 186 సరస్సులను కోల్పోయింది. 1.5 మిలియన్ హెక్టార్ల వెట్‌ల్యాండ్ అదృశ్యమైంది. ఇది స్థానిక జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. సింక్‌హోల్‌లు కొత్త భూభాగ ఆకృతులను సృష్టిస్తూ, భూసంరక్షణకు సవాళ్లు విసురుతున్నాయి.
పరిస్థితి మెరుగుపడాలంటే..
భూగర్భ జల వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమని.. లేకుంటే సింక్‌హోల్స్ మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు . తక్కువ నీటితో సాగు చేసే పంటలవైపు రైతుల మళ్లితే మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


