గవర్నెన్స్‌లో అవినీతి పెరిగిందంటున్నారు
నిత్యావసరాల ధరలు, తాగునీటి సమస్యలపై ప్రజల ఫిర్యాదు
హాస్టళ్ల పనితీరు బాగా లేదు.. ఈ సమస్యలేవీ లేకుండా కవర్ చేయాల్సి ఉంది
గ్రామ సచివాలయాల పేరు త్వరలో మారుస్తాం
అనర్హులు వికలాంగుల పింఛన్లు పొందుతున్నారు
ఏడాదిన్నరైనా చాలామంది మంత్రులకు అవగాహన లేదు
మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటున్నారు. గవర్నెన్స్‌లోనూ అవినీతి పెరిగిందంటున్నారు. ప్రజలు నిత్యావసర ధరలు పెరిగాయంటున్నారు. తాగునీటి సమస్య ఉందంటున్నారు. ఇవేవీ లేకుండా కవర్ చేయాల్సి ఉంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. హాస్టళ్ల పనితీరు బాగా లేదని ఒప్పుకొన్నారు. ఆలయాల దగ్గర సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు.
ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించకపోతే బంగారం ఇచ్చినా లాభం లేదని పేర్కొన్నారు. కొన్ని శాఖలు ఫైళ్లు కిందకు పైకి పంపుతున్నారని, ఇది పెద్ద సమస్యగా మారిందని అన్నారు. రాజ్యాంగానికే సవరణలు చేశారని, బిజినెస్ రూల్స్‌కు సవరణలు చేద్దామని వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
మూడు నెలల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి..
మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనలతో మూడు నెలల్లో అన్ని పథకాలు, సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని 80 నుంచి 90 శాతానికి తేవాలని చంద్రబాబు సూచించారు. గ్రామ సచివాలయాల పేరును త్వరలో మారుస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ 17 శాతం వృద్ధి సాధించేలా అన్ని శాఖలు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల సమాచారంతో డేటా లేక్ వ్యవస్థ సిద్ధమైందని, ఎవరు ఏం అనుకుంటున్నారో ఇందులో వస్తుందన్నారు.
‘‘ఐదేళ్లలో విద్యుత్ యూనిట్ కొనుగోలు ధరను రూ.4కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.9 వేల కోట్ల మేర చార్జీలు పెంచుకోవచ్చని ఈఆర్సీ అనుమతిచ్చినా.. ప్రజలపై భారం పడకూడదని అమలు చేయడం లేదు. టెక్నాలజీ సక్రమంగా ఉన్నా కొంతమంది వ్యవహార శైలి సరిగా లేకపోతే ఫలితం ఉండదు. ప్రజలకు ఫలితాలు రాకుండా పనిచేస్తామంటే కుదరదు’’ అని చంద్రబాబు తెలిపారు.
దేవాదాయ, రెవెన్యూ శాఖలు అనుకున్న విధంగా పనిచేయడం లేదన్నారు. జనవరి 15 నాటికల్లా అన్ని సేవలు వాట్సాప్‌లోనే అందించకుంటే తీవ్రంగా పరిగణించి సంబంధిత శాఖపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనర్హులు వికలాంగ పెన్షన్లు పొందుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో న్యాయ శాఖ బలహీనంగా ఉందని అన్నారు.
డబ్బులు విపరీతంగా లేవు...
అరగంటలో ఫైళ్లు క్లియర్ కావాలని చంద్రబాబు అన్నారు. కొందరి దగ్గర 15 రోజులు ఉంటున్నాయని.. ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర 11 రోజులు ఉన్నట్లు వివరించారు. మంత్రి స్పందిస్తూ బడ్జెట్‌కు మించి నిధుల కోసం ఫైళ్లు వస్తున్నాయని, పెండింగ్‌లో పెడుతున్నామన్నారు. సీఎం స్పందిస్తూ ప్రతి శాఖ బడ్జెట్ కేటాయింపు లోబడే ఉండాలని నిర్దేశించారు.
‘‘ప్రభుత్వం దగ్గర డబ్బులు విపరీతంగా లేవు. ఫైళ్లు ఎక్కువ రోజులు ఉంటే సంబంధింత మంత్రులు బాధ్యులవుతారు. ఏడు రోజులుకన్నా ఎక్కువ రోజులు ఫైళ్లు ఉన్న వారి నుంచి వివరణ తీసుకుంటాం. సకాలంలో ఖర్చు పెట్టక కేంద్ర పథకాల నిధులు వెనక్కు వెళ్లిపోతే.. ఆ శాఖల అధికారుల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఏడాదిన్నరైనా చాలామంది మంత్రులకు అవగాహన లేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తే సంబంధిత శాఖ సరిగా పనిచేయడం లేదని అర్థంగా చెప్పారు. వరికి ప్రత్యామ్నాయ సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ తీరు సరిగ్గా లేదని.. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.


