breaking news
unemployed peoples
-
‘హెచ్–1బీ’ గ్రేస్ పీరియడ్ 12 నెలలకు పెంచాలి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో లే–ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇతర రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫలితంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు నిరుద్యోగులుగా మారుతున్నారు. హెచ్–1బీ(నాన్–ఇమ్మిగ్రెంట్) వీసాపై ఉంటున్నవారు ఉద్యోగం పోయాక 60 రోజుల్లోగా(2 నెలలు) మరో కొలువు వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఈ గ్రేస్ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 12 నెలలకు(ఒక సంవత్సరం) పెంచాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అండ్ గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనే రెండు భారత–అమెరికన్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి. భారత టెకీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆన్లైన్లో పిటిషన్లు సమర్పిస్తున్నాయి. అధ్యక్షుడితోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి, యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్‌కు ఆన్లైన్లో పిటిషన్లను పంపిస్తున్నాయి. -
కోచింగ్ పూర్తాయె.. కొలువు రాదాయె!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. అప్పుచేసి హైదరాబాద్ బాట పట్టిన వాళ్లంతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నగరాల్లో చేసేదేమీ లేక సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది ఏదో ఒక ఉపాధి చూసుకునే యత్నంలో ఉన్నారు. కోచింగ్‌ల కోసం అప్పులు చేసిన వాళ్లు.. భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు. కొలువు వచ్చేదెన్నడు? ఆర్నెల్ల క్రితం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పోలీసు శాఖలో నియామకాల్లో మాత్రమే పురోగతి కన్పిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష జరగాల్సి ఉంది. గ్రూప్–4 ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. టీచర్ల నియామకాల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల టీచర్ పోస్టులున్నట్టు అధికారులు అంటుంటే, 12 వేల ఖాళీలున్నట్టు ప్రభుత్వం ఏడాది క్రితం తెలిపింది. బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప ఈ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనేది స్పష్టమయ్యేలా లేదు. ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా లేదు. టెట్ ఉత్తీర్ణులు టీచర్ పోస్టుల కోసం పెద్దఎత్తున కోచింగ్ తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపైనా అడుగులు పడాల్సి ఉంది. కోచింగ్ కోసం రూ. లక్షల్లో... నోటిఫికేషన్లు వస్తాయనే సమాచారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించింది. దీంతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో 25 వేల కోచింగ్ సెంటర్లలో 3.5 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ తీసుకున్నట్టు ఓ కోచింగ్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. కోచింగ్ ఫీజులు కూడా నాలుగు రెట్లు పెంచారు. అయితే, ఇప్పుడు నగరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సైతం కోచింగ్ పెద్దగా సాగడం లేదు. గ్రూప్–1 కోచింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ పరీక్ష జరిగితే నిరుద్యోగులు గ్రూప్–4పై దృష్టి పెడతారు. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలూ ఇదే ధోరణితో ఉన్నాయి. టీచర్ పోస్టుల కోసం ఇచ్చే కోచింగ్ చాలాచోట్ల ఆపేశారు. కోచింగ్ తీసుకునే వాళ్లు టీచర్ల నియామకాలు ఇప్పట్లో లేవని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నోటిఫికేషన్ వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని, దీనికి మళ్లీ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓయూలో మళ్లీ మొదలు పెడతాం గ్రూప్–1 పరీక్ష తర్వాత గ్రూప్–4 శిక్షణ మొదలు పెడతాం. తాత్కాలికంగానే కోచింగ్ ఆపేశాం. అయితే, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే యోచనలో ఉన్నారు. కోచింగ్ తీసుకున్న వాళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు. –ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కోచింగ్ తీసుకుని ఎదురుచూస్తున్నాం టీచర్ పోస్టు కోసం అప్పు చేసి కోచింగ్ తీసుకున్నా. ఇంకా హైదరాబాద్‌లో ఉండాలంటే సాధ్యం కావడం లేదు. ప్రైవేటు టీచర్‌గా పనిచేశాను. ఇప్పు డు ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి. నియామకాలు చేపడతారనే ఆశతో ఉన్నాను. –ఆర్.నరేంద్ర, వరంగల్, టెట్ కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థి -
వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌కు పంపిస్తామని నమ్మించిన ఏజెంట్లు అమాయకులను నిండా ముంచారు. రూ.3 కోట్లకు పైగా టోకరా వేశారు. వీసాల పేరిట ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది నిరుద్యోగులను వంచించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాధితుడు రాజు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఇజ్రాయెల్ వీసాల మోసం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లోని గాయత్రీనగర్, డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ఇజ్రాయెల్ వెళ్లడానికి వీసాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించారు. ఆరు నెలల కింద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూల పేరిట ఢిల్లీ, బెంగళూరుకు తీసుకెళ్లి వీసాల ప్రక్రియ ప్రారంభించినట్లు నమ్మించారు. అయితే, ఆర్నెల్లు అవుతున్నా వీసాలు ఇవ్వక పోవడంతో తాము చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని కోరితే భౌతిక దాడులకు పాల్పడినట్లు బాధితులు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వీసాల పేరిట నమ్మించి మోసగించిన ఏజెంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరారు. -
ఈ నెల 19న ‘చలో ఉస్మానియా’
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న ‘చలో ఉస్మానియా’ సత్యాగ్రహ పోస్టర్‌ను శనివారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 48 లక్షలకు మందికిపైగా నిరుద్యోగులుంటే ప్రభుత్వం కేవలం 37 వేల పోస్టులే భర్తీ చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి నారాయణ వద్ద పీఏగా చేస్తున్నానంటూ నిరుద్యోగులను నమ్మబలికాడు. మాజీ మంత్రికి చెప్పి కలెక్టరేట్లోనూ, ప్రభుత్వాసుపత్రులలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ వెనుకాల సెక్యురిటీ కోసం బౌన్సర్లను పెట్టుకుని, పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ నిరుద్యోగులను నమ్మిస్తాడు. వారి కి ఉద్యోగం కోసం అపాయింట్మెంట్ ఆర్డర్లు రెడీ చేయిస్తున్నట్లు హడావుడి చేస్తాడు. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.15 లక్షలు కాజేసీ ముఖం చాటేస్తున్నాడు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు సోమవా రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పం దన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు గోప్యంగా ఉంచమని కోరారు. వివరాల్లోకి వెళితే... తండ్రి రిటైర్డ్ జడ్జి, తల్లి ప్రభుత్వ వైద్యురాలు రాజమండ్రికి చెందిన మద్దిల దీపుబాబు (దీపు రుషి) మోసాలు చేసి డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడ మాచవరం ప్రాంతంలో జీవించే కుటుంబానికి మధ్యవర్తుల ద్వారా ఆరేడు నెలల క్రితం చేరువయ్యాడు. వారికి ఉద్యోగం అవసరం ఉందని గ్రహించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. తన తండ్రి రిటైర్డ్ జడ్జి అని, తల్లి గవర్నమెంట్ హస్పిటల్లో వైద్యురాలంటూ చెప్పి వారి వివరాలు ఇచ్చాడు. అంతేకాకుండా సొమ్ము కూడా తన చేతికి ఇవ్వనవసరం లేదని, బ్యాంకు ఖాతాలో వేస్తే సరిపోతుందని, ఆ సొమ్మును తాను తీసుకుని నాటి మంత్రి నారాయణకు అందజేస్తానని హామీ ఇచ్చాడు. దీనికి తోడు వారి నుంచే సెక్రటేరియట్లో సిబ్బందితో మాట్లాడుతున్నట్లు నటించాడు. దీపు బాబు మాటలు నమ్మిన వారు తమకు ఉద్యోగం వస్తుందని భావించారు. మూడు పోస్టులు.. రూ.15 లక్షలు ఒక మహిళ నర్సుట్రైనింగ్ పూర్తి చేయడంతో ఆమెకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.5 లక్షలు గుంజాడు. ఆమె అక్క కుమారుడికి కలెక్టరేట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.5 లక్షలు, వారి బంధువుల్లో పీజీ చదివిన యువతికి కలెక్టరేట్లో ఉద్యోగమని చెప్పి రూ.3.5 లక్షలు వసూలు చేశారు. బ్యాంకు ఖాతాలో వేయించుకోవడమే కాకుండా నగదుగా మరో మూడు లక్షల వరకు తీసుకున్నాడు. ప్రభుత్వం మారిపోయిందంటూ.. డబ్బులు మొత్తం ఇచ్చేసిన తరువాత దీపుబాబు ముఖం చాటేశాడు. ఫోన్ పనిచేయడం లేదంటూ వారికి అందుబాటులోకి రాకుండా తప్పించుకుని తిరగసాగాడు. సోషల్ మీడియాలోని అకౌంట్లు కూడా మార్చేశాడు. అయితే బాధితులు ఏదో విధంగా అతని ఆచూకీ తెలుసుకుని తమ డబ్బు వెనక్కు ఇచ్చేయాలంటూ కోరినా ప్రయోజనం ఉండటం లేదు. కాగా ఉద్యోగం వస్తుందనే ఆశతో తమ ఇళ్లు తాకట్టుపెట్టుకుని, బంగారం విక్రయించుకుని దీపు బాబుకు కట్టామని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు. తమలాగా మరి కొంత మంది బాధితులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
నిరుద్యోగులను నిండా ముంచేసిన రాష్ట్ర సర్కార్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఐదేళ్ల పదవీకాలంలో ఆ నినాదాలను పూర్తిగా తుంగలోతొక్కింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన వారి సంఖ్య కలుపుకొంటే మొత్తం ఖాళీలు 2.40 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు.. కేవలం రెండు వేలు మాత్రమే. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించి 2016 వరకు వాటి ఊసే ఎత్తలేదు. గ్రూప్–1, 2, 3తో పాటు కొన్ని సాంకేతిక పోస్టులు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 4,275 ఖాళీల భర్తీకి మాత్రమే 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి 15.99 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించడాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులను చంద్రబాబు ఏవిధంగా వంచించారో అర్థమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో 5.50 లక్షల మందికిపైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ అని చెప్పినా.. ఇప్పటివరకు ఒకే ఒక్క డీఎస్సీని మాత్రమే పూర్తయింది. గత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన పోస్టులు పూర్తి చేశాక.. రాష్ట్రంలో ఇంకా 22 వేలకు పైగా టీచర్ ఖాళీలు భర్తీ చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. అయితే చివరకు ఆ పోస్టుల సంఖ్యను 7,902కు కుదించేసింది. అవిగో నియామకాలు, ఇవిగో వేలాది పోస్టుల భర్తీలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం రెండు వేలు మాత్రమే. ఇది పూర్తిగా తమ ఆశలతో, ఆశయాలతో ఆడుకోవడం లాంటిదేనని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కుదింపు ప్రభుత్వ శాఖల్లో మంజూరైన మొత్తం పోస్టులు, ఖాళీల సంఖ్యను ప్రభుత్వం కుదించి చూపిస్తూ నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 2.40 లక్షలుంటే ఖాళీల సంఖ్య కేవలం 77,737 మాత్రమేనని, వీటిలో పైస్థాయిలో ఉండే 20 వేల పోస్టులను రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తక్కినవాటిలో అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ప్రభుత్వ శాఖల్లోని పోస్టులే కాకుండా ఉపాధ్యాయుల పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందు 22 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. చివరకు 7,902కు ఆ సంఖ్యను తగ్గించేసింది. మళ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేసింది. 18,450 పోస్టుల భర్తీ అంటూ ప్రచారం చేసింది. ఈ నోటిఫికేషన్లు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమను మరోసారి వంచించడానికే ప్రభుత్వం నోటిఫికేషన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని నిరుద్యోగుల ధ్వజమెత్తుతున్నారు. రూల్–7 ఎత్తివేతతో అన్యాయం గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలోని పోస్టులకు ఎంపికైనవారు చేరకపోయినా, చేరి రాజీనామా చేసినా ఆ పోస్టులను కమిషన్ నిబంధనావళిలోని రూల్–7 ప్రకారం.. మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థికి కేటాయించేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రూల్ ఎత్తేస్తూ జీవో ఇచ్చారు. రూల్–6ను మాత్రం కొనసాగించారు. రూల్–6.. ప్రకారం మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులకు ఇవ్వకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లిస్తారు. ఫలితంగా నిరుద్యోగ అభ్యర్థులను తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టులు మిగిలిపోయేలా ప్రభుత్వ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం హామీని నమ్మి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు, డీఎస్సీ వస్తాయన్న ఆశతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత గత నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వీరిలో అనేకమంది లక్షల రూపాయలు అప్పులు చేసి కోచింగ్‌లు కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు అరకొరగా ఉండడం, కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో వీరంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. వయోపరిమితి దాటిపోయి.. అవకాశాలు కోల్పోయి.. నాలుగున్నరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి పోయారు. ఇప్పుడు వారికి ఏ అవకాశం లేక ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు. వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని లేనిపక్షంలో ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున ప్రతినెలా భృతి ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వ నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు ’యువ నేస్తం’ పేరిట నిరుద్యోగ భృతి హామీలో వెయ్యి కుదించి ఇస్తోంది. అయితే భృతికి అర్హుల సంఖ్యను కుదించేశారు. ఇప్పటికే అనేక నిబంధనలు పెట్టడంతో 5 లక్షల మంది మాత్రమే యువనేస్తానికి దరఖాస్తు చేశారు. తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు, ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 1.5 లక్షల మందిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కుక్‌లు, సహాయకులు 80 వేల మంది, వయోజనవిద్య సమన్వయకర్తలు 20 వేల మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 25 వేల మంది ఉన్నారు. వీరందరినీ చంద్రబాబు సర్కార్ తొలగించి రోడ్డున పడేసింది. ఆటో తోలుకుంటున్నా –కోయ శ్రీనివాస్, కొల్లిపర, గుంటూరు జిల్లా నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో బాడుగకు ఆటో నడుపుకొంటున్నా. యజమానికి అద్దె పోనూ రోజూ రూ. 100 మాత్రమే మిగులుతున్నాయి. ఈ మొత్తంతో నలుగురు కుటుంబ సభ్యులను పోషించడం కష్టంగా ఉంది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదు. ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా –వి.రామారావు, విజయవాడ నేను 2016లో ఎంబీఏ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని అప్పు చేసి విజయవాడలో కోచింగ్ కూడా తీసుకున్నా. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను. రిజర్వుడ్ అభ్యర్థులకు ‘ఓపెన్’ దెబ్బ! రాష్ట్రంలోని ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రత్యేక మినహాయింపులు పొందిన ఆయా కేటగిరీల అభ్యర్థులు వారి రిజర్వుడ్ పోస్టులకే తప్ప ఓపెన్ కేటగిరీ పోస్టులకు ఎంపికచేయకుండా అన్యాయం చేస్తోంది. దీనిపై ఆయా కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంతమందిని ఎంపిక చేయాలి? రిజర్వేషన్లను ఎలా అమలుచేయాలన్నది ప్రభుత్వం నిర్దేశించాలి. కానీ, ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇటీవల ఏపీపీఎస్సీకి అప్పగించింది. గతంలో స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ప్రభుత్వం జీఓలు ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా అమలుచేయించింది. ఇప్పుడీ అధికారాన్ని కమిషన్‌కు అప్పగించడమే కాదు.. ఎంతమందిని ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలో కమిషన్ నిర్ణయానికే వదిలేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు ఈ కథను తెరవెనుక నుంచి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఇస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కడా ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్పష్టంచేయకుండా గోప్యత పాటిస్తోంది. మరోవైపు.. నిర్ణీత నిష్పత్తిని ముందుగా ప్రకటించి కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను పెట్టి అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్టు నుంచి ఎంపికచేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నా కమిషన్ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు ముగిశాక జనరల్ కటాఫ్‌ను నిర్ణయించి మెయిన్స్‌కు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అవసరమో ఆ మేరకు ఎంపికచేస్తామని, వారిలో రిజర్వుడ్ అభ్యర్థులు నిష్పత్తిలో లేకపోతే కటాఫ్ తగ్గించి తక్కిన వారిని ఎంపికచేస్తామని చెబుతోంది. ఇలా చెబుతూనే.. ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారని షరతు విధించింది. దీంతో ఇప్పటికే పలు సంఘాలు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా ఫలితంలేదు. కమిషన్ తీరుపై అనుమానాలు కమిషన్ ఇలా చేయడం వెనుక తమకు కావలసిన అభ్యర్థులందరినీ స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు వచ్చేలా చేయడం, ఆ తరువాత వారికి ఇంటర్వ్యూల్లో అత్యధిక మార్కులు వేయడం ద్వారా గ్రూప్–1 సహా ఇతర ముఖ్యమైన పోస్టులను కట్టబెట్టాలన్న వ్యూహం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే తమ వారి కోసం ఇలా చేయిస్తున్నారని, పూర్తి అధికారాలను కమిషన్‌కు అప్పగించి దాని ద్వారా తమ పనికానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ పోస్టుల్లోనూ ఇదే తంతు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోని 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలోనూ రిజర్వుడ్ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఆయా వర్సిటీలకు సమర్పించింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీపీఎస్సీ తరహాలోనే రిజర్వుడ్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీకి అవకాశంలేకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి కేటగిరీల వారీగా నిర్ణయించిన అర్హత మార్కులను అనుసరించి ఎంపికైన వారందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టుల ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉన్నా కేవలం తమ వారికి మాత్రమే ఆయా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూ లేఖలను పంపిస్తున్నారు. ఈ విషయం చాలా రహస్యంగా తెరవెనుక జరిగిపోతోందని, అనేక వేలమంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్ 2016 నోటిఫికేషన్ల సమయంలోనే ఏపీపీఎస్సీ ఈ విధంగానే రిజర్వుడ్ అభ్యర్థులను వారి కేటగిరీకి పరిమితం చేస్తూ అన్యాయం చేసిందని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు ఇంతకుముందు పెంచిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వారికి నిర్దేశించిన పరిమితికి అదనంగా ఈ పెంపు కూడా వర్తించింది. కొన్ని నోటిఫికేషన్ల సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర అభ్యర్థులు మెరిట్ సాధించి ఇతరులకన్నా అగ్రస్థానంలో ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హత సాధించినా ఏపీపీఎస్సీ వారిని ఆ పోస్టులకు అనుమతించలేదు. దీనిపై కొందరు అభ్యర్థులు కమిషన్ ఎదుట తమ అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. వారిని ఇతరులతో పాటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా కమిషన్ ఆ తీర్పును ఖాతరు చేయకుండా ప్రభుత్వ పెద్దల సూచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇటీవల సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి.. కమిషన్‌కు లేఖ రాసినా కమిషన్ చైర్మన్ దాన్ని బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. పైగా, హైకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరంలేదని ఏపీపీఎస్సీ పేర్కొంటుండడం విశేషం. -
నిరాశలో నిరుద్యోగులు
► ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు విజయనగరం: డిగ్రీ, పీజీలు చేత పట్టుకుని కోచింగ్ సెంటర్లలో ఉంటున్న నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణలు తీసుకుంటున్నారు. ఓ పక్క శిక్షణ తీసుకుంటూనే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోచింగ్ తీసుకోవడంతో పాటు స్థానిక లైబ్రరీలలో గంటల తరబడి చదువుతూ, ఓ రకంగా యజ్ఞమే చేస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, స్టీల్‌ప్లాంట్, రైల్వే, గ్రూప్స్, తదితర పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటాపోటీగా చదువుతున్నారు. చాలామంది అభ్యర్థులు ఇటీవల పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తలపడ్డారు. అలాగే గ్రూప్ –2 ప్రిలిమినరీ పాసై మరో రెండురోజుల్లో జరగనున్న మెయిన్స్‌కు సిద్ధపడుతున్నారు. ఐబీపీఎస్‌లో 14 వేల ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటన వచ్చింది గాని ఇంతవరకు సైట్ ఓపెన్ కావడం లేదని అభ్యర్థులు తెలిపారు. రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవు.. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. –రమేష్, నిరుద్యోగి