నిరుద్యోగులకు కుచ్చుటోపీ

Unemployed People Duped By A Person In Krishna District - Sakshi

మాజీ మంత్రి నారాయణ పీఏనంటూ ప్రచారం

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హామీ

రూ.15 లక్షల స్వాహా

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి నారాయణ వద్ద పీఏగా చేస్తున్నానంటూ  నిరుద్యోగులను నమ్మబలికాడు. మాజీ మంత్రికి చెప్పి కలెక్టరేట్‌లోనూ, ప్రభుత్వాసుపత్రులలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ వెనుకాల సెక్యురిటీ కోసం బౌన్సర్లను పెట్టుకుని, పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ నిరుద్యోగులను నమ్మిస్తాడు. వారి కి ఉద్యోగం కోసం అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు రెడీ చేయిస్తున్నట్లు హడావుడి చేస్తాడు. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.15 లక్షలు కాజేసీ ముఖం చాటేస్తున్నాడు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు  సోమవా రం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే స్పం దన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.మోహన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు గోప్యంగా ఉంచమని కోరారు. వివరాల్లోకి వెళితే...

తండ్రి రిటైర్డ్‌ జడ్జి, తల్లి ప్రభుత్వ వైద్యురాలు 
రాజమండ్రికి చెందిన మద్దిల దీపుబాబు (దీపు రుషి)  మోసాలు చేసి డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడ మాచవరం ప్రాంతంలో జీవించే కుటుంబానికి మధ్యవర్తుల ద్వారా ఆరేడు నెలల క్రితం చేరువయ్యాడు. వారికి ఉద్యోగం అవసరం ఉందని గ్రహించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. తన తండ్రి రిటైర్డ్‌ జడ్జి అని,  తల్లి గవర్నమెంట్‌ హస్పిటల్‌లో వైద్యురాలంటూ  చెప్పి వారి వివరాలు ఇచ్చాడు. అంతేకాకుండా సొమ్ము కూడా తన చేతికి ఇవ్వనవసరం లేదని,  బ్యాంకు ఖాతాలో వేస్తే సరిపోతుందని, ఆ సొమ్మును తాను తీసుకుని నాటి మంత్రి నారాయణకు అందజేస్తానని హామీ ఇచ్చాడు. దీనికి తోడు వారి నుంచే సెక్రటేరియట్‌లో సిబ్బందితో మాట్లాడుతున్నట్లు నటించాడు.  దీపు బాబు మాటలు నమ్మిన వారు తమకు ఉద్యోగం వస్తుందని భావించారు.

మూడు పోస్టులు.. రూ.15 లక్షలు 
ఒక మహిళ నర్సుట్రైనింగ్‌ పూర్తి చేయడంతో ఆమెకు గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో  ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.5 లక్షలు గుంజాడు. ఆమె అక్క  కుమారుడికి కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.5 లక్షలు, వారి బంధువుల్లో పీజీ చదివిన యువతికి కలెక్టరేట్‌లో ఉద్యోగమని చెప్పి  రూ.3.5 లక్షలు వసూలు చేశారు. బ్యాంకు ఖాతాలో వేయించుకోవడమే కాకుండా నగదుగా మరో మూడు లక్షల వరకు తీసుకున్నాడు.
 
ప్రభుత్వం మారిపోయిందంటూ..
డబ్బులు మొత్తం ఇచ్చేసిన తరువాత దీపుబాబు ముఖం చాటేశాడు. ఫోన్‌ పనిచేయడం లేదంటూ వారికి అందుబాటులోకి రాకుండా తప్పించుకుని తిరగసాగాడు. సోషల్‌ మీడియాలోని అకౌంట్లు కూడా మార్చేశాడు. అయితే బాధితులు ఏదో విధంగా అతని ఆచూకీ తెలుసుకుని తమ డబ్బు వెనక్కు ఇచ్చేయాలంటూ కోరినా ప్రయోజనం  ఉండటం లేదు.  కాగా ఉద్యోగం వస్తుందనే ఆశతో  తమ ఇళ్లు తాకట్టుపెట్టుకుని, బంగారం విక్రయించుకుని దీపు బాబుకు కట్టామని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు.  తమలాగా మరి కొంత మంది బాధితులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారులు  న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top