దేశాన్ని కదిలించిన కోటేశు | Krupakar Madiga Write on Kanchikacherla Koteshu Incident | Sakshi
Sakshi News home page

దేశాన్ని కదిలించిన కంచికచర్ల కోటేశు

Feb 26 2026 2:12 PM | Updated on Feb 26 2026 2:16 PM

Krupakar Madiga Write on Kanchikacherla Koteshu Incident

కంచికచర్ల కోటేశుగా పిలవబడుతున్న కోటేశు అసలు పేరు ఆరుకుట్ల కోటేశు. మాదిగ కులస్థుడు. బాల కార్మికుడు. కోటేశు ఊరు కృష్ణా జిల్లా కంచికచర్ల పక్కన పరిటాల గ్రామం. కంచిక చర్లలో కూలి పనులకు వెళ్ళేవాడు. ఇత్తడిచెంబు దొంగతనం చేసి, హోటల్‌ యజమానికి తాకట్టు పెట్టి, భోజనం చేసినట్టు కంచికచర్ల ఆసాములు కోటేశుపై నేరారోపణ చేశారు. ఆధిపత్య కులం ఆడపిల్లతో కోటేశు మాట్లాడటమే అసలు కారణమని లోకులు అనుకుంటుంటారు. దీంతో సుమారు పదిమంది టీనేజి యువకుడైన కోటేశును చేతులు కట్టివేసి, ఒంటిపై కిరోసిన్‌ పోసి, సజీవ దహనం చేశారు. ఇది జరిగింది 1968 ఫిబ్రవరి ఇరవై నాలుగున. విజయవాడ గవర్నమెంట్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 1968 ఫిబ్రవరి 26న కోటేశు చనిపోయాడు.

ఈ సంగతి తెలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేముల జార్జి మాస్టర్ (vemula george) చలించిపోయారు. కుల పెద్దలయిన తంగిరాల షడ్రక్, కనకాల వెంకటరత్నం వంటి వారిని వెంటబెట్టుకుని, టెలిగ్రామ్స్‌ ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు, అధికారులకు సమాచారం పంపించాడు.

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ఆ కాలంలో స్విట్జర్లాండ్‌లో చెంచా దొంగిలించిన నెపంతో ఒక నల్ల జాతీయుడిపై జరిగిన హత్యోదంతంతో పోల్చుతూ, కంచికచర్ల సంఘటనపై వార్త ప్రచురించింది. బీబీసీలో వార్తలు ప్రసారం అయ్యాయి. దీనితో భారత దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలు కదిలాయి. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రి జగ్జీవన్‌ రామ్‌ కంచికచర్ల సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎస్సీల దుర్భర పరిస్థితులు గమనించి, దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమం, ఇరవై సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి ఎంపీ కోట పున్నయ్య రాజ్య సభలో 1968 మార్చి ఇరవైన సంధించిన పలు ప్రశ్నలకు నాటి కేంద్ర హోమ్‌ శాఖామంత్రి వైబీ చవాన్‌ ఏడు పేజీల సమాధానం చెప్పాల్సి వచ్చింది.

చ‌ద‌వండి: సైనిక ఓట‌మా? సైద్ధాంతిక వైఫ‌ల్య‌మా?

కోటేశు కేసులో ఏడుగురు ముద్దాయిలపై మచిలీపట్నం జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టుల దాకా విచారణ సాగింది. ముగ్గురికి మాత్రమే శిక్షలు పడ్డాయి. సరైన సాక్ష్యాలు లేవని హైకోర్టు నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. అలాగే కోటేశు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో దోషుల పేర్లు చెప్పలేక పోయాడు. కోటేశు సజీవదహన సంఘటన నాటి సమాజాన్ని తీవ్రంగా కదిలించింది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కొత్త చైతన్యం వెల్లివిరిసింది. దిగంబర కవులు వారి కవిత్వాన్ని కంచికచర్ల కోటేశుకు అంకితమిచ్చారు. ఇది కోటేశు 58వ వర్ధంతి సంవత్సరం. అన్యాయాల పట్ల ప్రతిఘటించే చైతన్యం పెంచుకోవడమే మనం కోటేశుకి అర్పించే నివాళి.

– కృపాకర్‌ మాదిగ 
సామాజిక కార్యకర్త 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement