వరి మనమే తినట్లేదు.. ప్రభుత్వం కొని ఏం చేస్తుంది?: సీఎం చంద్రబాబు
ఉద్యాన పంటలకూ ధరల సమస్య
రైతుల్లో మార్పు రావాలి.. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది
కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే.. మంత్రి సత్యకుమార్‌ను నేను అడగలేను కదా!
సాక్షి, అమరావతి: రైతులు పండించే అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది 55 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, వచ్చే ఏడాదీ కొనాలంటే సాధ్యం కాదన్నారు. మనం పండించే వరిని మనమే తినడం లేదని, అలాంటి వరిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఏం చేస్తుందని సీఎం ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్‌డీపీ వృద్ధిపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
రైతులు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్న ప్రశ్నపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కువ మంది వరి పండించడంతో ఉత్పత్తి పెరిగిందన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారని, దీంతో వాటి కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ‘రాబోయే రోజుల్లో వరి తినరు. బియ్యం తింటే డయాబెటిస్‌తో పాటు ఇతర జబ్బులన్నీ వస్తాయి. రైతులు కూడా ప్రజలు వినియోగించే పంటలనే సాగు చేయాలి. ఉద్యాన పంటలకు కూడా ధరల సమస్య తలెత్తింది. అరటి సాగు ఎక్కువ కావడంతో ఉత్పత్తి పెరిగి ధరల సమస్య ఉత్పన్నమైంది.
ఓ రైతు 60 ఎకరాల్లో అరటి పంట వేశారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా రైతులు పంటలు సాగు చేయాలి. ఉద్యాన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అనంతపురంలో 51 రకాల పండ్లు పండిస్తున్నారు. అన్నీ కొనాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు. సమతుల్యం చేసుకోవాలి. పంటల మారి్పడిపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు రైతు సేవా కేంద్రాల వారీగా కార్యాచరణ తయారు చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో అగ్రిటెక్ అమలు చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య పెంచేసింది
ఈ ఆరి్థక ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్‌డీపీ లక్ష్యంలో 40.64 శాతం వృద్ధి సాధించామని, మిగతా రెండు త్రైమాసికాల్లో 59.36 శాతం వృద్ధి సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ చర్యల వల్ల ఆదాయం తగ్గిపోయిందంటూ మరోసారి నిందించారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు, అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నామన్నారు. 18 నెలల్లో ఎన్ని అప్పులు చేశారన్న ప్రశ్నకు తరువాత జవాబు చెబుతానన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను పెంచేయడంతో రాష్ట్ర సొంత ఆదాయం అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను నియమించారని, పునర్ వ్యవస్థీకరణ ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పరకామణిలో డబ్బులు కొట్టేయడం చిన్న నేరం అనడం సరి కాదన్నారు.
కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్‌ను అడగలేను కదా?
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ౖరాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై స్పందించాలని విలేకరులు కోరగా.. ఊహించని సమస్య వచ్చిందని, దీన్ని కేంద్రం పరిష్కరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, అయితే కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్‌ను నేను అడగలేను కదా? అని చంద్రబాబు ఎదురు ప్రశి్నంచారు. కేంద్ర మంత్రుల పనితీరులో తన జోక్యం ఉండదన్నారు.
సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే...
సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దిశగా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్‌పై సీఎం సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని సీఎం చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్‌లో నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు.


