బిక్కవోలు సొసైటీ నుంచి హైస్కూల్ వరకు బారులు తీరిన రైతులు
బిక్కవోలులో పోలీసుల సమక్షంలో పంపిణీ తిరుపతిలో టోకెన్లు ఉన్నవారికే బస్తా
బిక్కవోలు/తిరుపతి రూరల్: రైతన్నను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని సొసైటీ వద్ద సోమవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. బిక్కవోలు సొసైటీ పరిధిలో 378 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. తొలి విడతగా 50 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. యూరియా లేకపోతే ఇబ్బంది పడక తప్పుదు అని రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో క్యూలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసుల సమక్షంలో యూరియాను అందించారు.
తిరుపతిలో... తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మండలంలోని కె.వడ్డేపల్లి రైతు భరోసా కేంద్రంలో యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంత సమయం సరఫరా నిలిపివేయడంతో అన్నదాతలు క్యూ కట్టారు. పాకాల
మండలంలోని గాదంకి, ఆదెనపల్లి, కావలివారి పల్లి, కె.వడ్డేపల్లి పంచాయతీలకు చెందిన 300మంది రైతులకు అధికారులు టోకెన్లను మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకుని మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకున్నారు.
టోకెన్లు ఉన్న వారు మాత్రమే రావాలని, మిగతా వారికి మరికొన్ని రోజుల్లో యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఒకింత గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం టోకెన్లున్న రైతులు యూరియా తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతలు తమకు కావాల్సిన వారికి ముందుగానే టోకెన్లు ఇచ్చి యూరియాను దారి మళ్లించారని, అందుకే తమకు ఈ కష్టాలని పలువురు రైతులు వ్యాఖ్యానించారు.


