ఆత్మకూరు జడ్జి ఎదుట గోడు వెళ్లబోసుకున్న బాధిత రైతులు
అత్మకూరు: యూరియా అడిగితే ఇవ్వకుండా టీడీపీ నేతలకు మాత్రమే ఇస్తుండడాన్ని ప్రశ్నించినందుకు ఓ రైతుపై ఆ పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. మూడు రోజులుగా పంపిణీ చేస్తున్నా.. తమకు ఇవ్వడం లేదని ఆ రైతు అడగడమే నేరమన్నట్లుగా తీవ్రంగా కొట్టిందే కాక.. కేసు పెట్టి పోలీసులతోనూ కొట్టించారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురంలో జరిగింది.
తెలుగురాయపురం గ్రామానికి చెందిన రైతులు అల్లంపాటి శ్రీనివాసులురెడ్డి, రాపూరు చినపెంచలరెడ్డి, ఏ వెంకటనరసారెడ్డి గ్రామంలోని సచివాలయం వద్దకు యూరియా కోసం మూడు రోజుల కిందట వెళ్లారు. అయితే అక్కడ టీడీపీకి చెందిన దేవరాయపల్లి ప్రతాప్ అనే వ్యక్తి తమ వారికి మాత్రమే యూరియా ఇప్పించుకుంటున్నాడు. దీనిని ప్రశ్నించిన ఆ ముగ్గురు రైతులపై ఆ టీడీపీ నాయకుడు కలువాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించాడు.
ఎస్‌ఐ బాధిత రైతులను రోజూ రప్పిస్తూ రాత్రి వరకు స్టేషన్‌లో ఉంచుకుని పంపారు. గురువారం ఈవిషయమై రైతులు ప్రశ్నించడంతో లాఠీలతో కొట్టారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధను తట్టుకోలేక నేరుగా ఆత్మకూరు కోర్టుకు వచ్చి జడ్జికి తమకు జరిగిన అన్యాయంపై వివరించారు. దీంతో జడ్జి.. ముందు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని న్యాయవాదిని పురమాయించి వైద్యశాలకు పంపారు. దీంతో ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆ ముగ్గురు రైతులు చికిత్స పొందుతున్నారు.


