దేవదేవుడి దివ్య ప్రసాదంపై విషప్రచారం పాపం చంద్రబాబుదే
పిడుగురాళ్ల, వినుకొండ పట్టణాల్లో ఫ్లెక్సీలతో టీడీపీ నీచ రాజకీయం
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, నరసరావుపేట/దర్శి/తాడేపల్లి రూరల్: తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యిపై చంద్రబాబు విషప్రచారం కుట్రలను సీబీఐ సిట్ బట్టబయలు చేయడంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ కూటమి మరో మహా పాపానికి ఒడిగట్టింది. వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడమే లక్ష్యంగా పలు చోట్ల ఫ్లెక్సీలతో నీచ రాజకీయాలకు తెగబడింది. పల్నాడు జిల్లా వినుకొండ, పిడుగురాళ్లలోని పలు కూడళ్లలో వివాదాస్పద ఫ్లెక్సీలను టీడీపీ కూటమి నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు, హిందూత్వవాదులు భగ్గుమన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి విద్వేషపూరిత ఫ్లెక్సీలతో నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను తొలగించాలని పట్టుబట్టారు. వినుకొండలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ తదితరులు, పిడుగురాళ్లలో మాజీ జెడ్పీటీసీ రామిరెడ్డి ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్శిలో భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రకాశం జిల్లా దర్శి గడియారస్తంభం సెంటర్‌లో టీడీపీ కూటమి నేతలు ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అబద్ధాలతో ముద్రితమైన ఫ్లెక్సీలు కడితే సహించేది లేదని హెచ్చరించాయి. వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ వెన్నపూస వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తొలుత నగర పంచాయతీ కమిషనర్ మహేష్ కు ఫోన్ చేసి ఫ్లెక్సీలు తొలగించాలని కోరారు.
తాను ఘటనాస్థలానికి వస్తున్నానని చెప్పిన కమిషనర్ రాలేదు. ఫోన్ చేసిన వారి నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలను తొలగించి కాల్చివేశారు. దీంతో ఎస్‌ఐ మురళి అక్కడకు చేరుకుని వైఎస్సార్‌సీపీ నేతలతో దురుసుగా మాట్లాడారు. నేతలను బలవంతంగా లాక్కొని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో బంధించారు.
ఆ తర్వాత టీడీపీ నాయకులు అదే ప్రాంతంలో మరోసారి మూడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి దర్శికి వస్తుంటే ఎస్‌ఐ మురళి కాన్వాయ్‌గా వెళ్లి ఆమెను తీసుకుని రావడం గమనార్హం. టీడీపీ నేతలు వెళ్లిపోయాక పోలీసులు స్టేషన్‌లో బంధించిన వైఎస్సార్ సీపీ నేతలను బైండోవర్ చేసి పంపించారు.
తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
తిరుమల వెంకన్న దివ్య ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ కూటమి పైశాచికానందం పొందుతోందని వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షులు అంకిరెడ్డి నారాయణమూర్తి ధ్వజమెత్తారు. ఈ మేరకు పలుచోట్ల టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన విద్వేషపూరిత ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నారాయణమూర్తితోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ప్రజాసంఘ నాయకులు, బొందలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర సింగ్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుసేన్, సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ జావీద్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీ వనం సత్య కల్యాణి, గుంటూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్, అడ్వకేట్ వెంకటనారాయణ రెడ్డి పాల్గొన్నారు.


