భార్యను వేధింపులకు గురి చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం
కుటుంబ సభ్యుల సహకారంతో గదికి తాళం వేసిన భార్య
అనైతిక వ్యవహారంపై ఫిర్యాదు చేసినా కేసు నమోదులో పోలీసుల తాత్సారం
నన్ను వంచించిన శ్రీనివాస్‌ను ఆలయ చైర్మన్‌గా తొలగించండి..
తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు శ్రీనివాస్ భార్య మొర
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...!
బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు..
మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్‌తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్‌కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్‌ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్‌గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు.
అడ్డంగా చిక్కిన శ్రీనివాస్..
కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్‌లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు.
అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్‌ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్‌కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.
వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు..
మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


