2022లోనే దీనిని నోటిఫై జబ్బుల జాబితాలో చేర్చిన జగన్ సర్కారు
కానీ, ఇప్పుడే నోటిఫై చేసేసినట్లు బాబు ఆర్భాటంగా ప్రకటన
సాక్షి, అమరావతి: పాలనలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎవరో చేసిన పనులను తన ఘనతగా చిత్రీకరించుకుంటూ సీఎం చంద్రబాబు తన రికార్డును తనే బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పరంపరలో భాగంగా క్యాన్సర్‌ను నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందంటూ గురువారం ఆయన ప్రకటించారు. నిజానికి.. క్యాన్సర్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ 2022 మే 16న క్యాన్సర్‌ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.
అంతేకాక.. ప్రభుత్వ రంగంలోనూ క్యాన్సర్ వైద్యసేవలను బలోపేతం చేయడంతో పాటు, 50 కి.మీ దూరంలోనే ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తేవడం, ప్రారంభ దశలోనే వ్యాధి గుర్తించడం సహా ఇతర చర్యల్లో భాగంగా కాంప్రహెని్సవ్ క్యాన్సర్ కేర్‌కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు, కర్నూల్ స్టేట్ క్యాన్సర్ యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
సమగ్రంగా అధ్యయనం చేయడానికి క్యాన్సర్ అట్లాస్‌కు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వంలో నమోదయ్యే ప్రతి కేసు నమోదుకు వీలుగా జబ్బును నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి అప్పట్లోనే చేర్చారు. రాష్ట్రవ్యాప్త సర్వేకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగా ఇప్పుడా సర్వేను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. సర్వేలో గుర్తించిన వివరాలతో అట్లాస్‌ను ప్రారంభించి, క్యాన్సర్‌ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో తమ ప్రభుత్వమే చేర్చినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.


