గీతం యూనివర్శిటీ ఆక్రమణ భూమలు పరిశీలనకు వెళుతున్న శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, కన్నబాబు తదితరులు
చంద్రబాబు కుటుంబసభ్యులు రూ.వేలకోట్ల భూములు దోచుకుంటున్నారు
మా హయాంలో రూ.5 వేలకోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి హెచ్చరిక బోర్డులు పెట్టాం
ఈ వ్యవహారంపై పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు
గీతం భూదోపిడీపై జనసేన, బీజేపీ స్పందించాలి
శాసనమండలిలో విపక్షనేత బొత్స, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు
గీతం ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వభూమిని స్థానిక టీడీపీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్‌కి చెందిన గీతం విద్యాసంస్థకు రెగ్యులరైజేషన్ చేసే ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి ఆ భూమిని క్రమబద్ధీకరించడానికి జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీమంత్రి బాల రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల, చింతలపూడి, నేతలు గురువారం గీతం ఆక్రమణలో ఉన్న భూములను పరిశీలించేందుకు వెళ్లారు.
వీరు ఆ స్థలంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ భూముల బదలాయింపు అంశాన్ని అజెండా నుంచి తీసేస్తే తప్ప శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనివ్వబోమని, తమ కార్పొరేటర్లు అడ్డుకుంటారని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ భూ దోపిడీపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఎంపీ భరత్ భూ దోపిడీపై పార్లమెంట్‌లో సైతం గళం వినిపిస్తామని చెప్పారు. ఈ భూ దోపిడీని నిరసిస్తూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులతో కలిసి తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అయినా ప్రభుత్వం ముందుకెళితే తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
చట్టాలంటే చంద్రబాబుకి గౌరవం లేదా?
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖలో వేలకోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు ధారాదత్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గీతం చెరనుంచి రూ.5 వేలకోట్ల విలువైన 54.79 ఎకరాల భూములను కాపాడి, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని, దీని ఆక్రమణదారులు శిక్షార్హులవుతారని హెచ్చరిక బోర్డులు పెట్టాం. ఇప్పుడు ఆ భూమిని చంద్రబాబు తన కొడుకు తోడల్లుడికి బహుమానంగా ఇచ్చేస్తున్నాడు. చట్టాలను కాపాడాల్సిన చంద్రబాబే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను వైఎస్ జగన్ సొంత ఆస్తులే అన్నట్టు విషం చిమ్మిన ఎల్లో మీడియా, హడావుడి చేసిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఈ భూకబ్జాను పవన్ సమర్థిస్తున్నారా? కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ భూదోపిడీకి వత్తాసు పలుకుతున్న ఈ ప్రభుత్వంపై పోరాడతాం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపదు. గీతం భూదోపిడీపై బీజేపీ కూడా స్పందించాలి. – బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో విపక్షనేత
గతంలో గీతం కబ్జా నుంచి కాపాడాం
పేద విద్యార్థుల నుంచి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్న గీతం యూనివర్సిటీకి ఇప్పుడు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఈ భూమిని గీతం యూనివర్సిటీ కబ్జా నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కాపాడాం.
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. మా హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం ముందుకెళితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్
భూదోపిడీ ఆగేదాకా ఉద్యమం
గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూమిని వారికే ధారాదత్తం చేసే విధంగా జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో పెట్టడాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అడ్డగోలు భూదోపిడీ ఆగేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం. – కె.కె.రాజు, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు
అజెండా నుంచి తీసేసేదాకా కౌన్సిల్ సమావేశం జరగనివ్వం
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విశాఖలో విలువైన భూములను పెట్టుబడుల పేరుతో సూట్‌కేస్ కంపెనీలకు ధారాదత్తం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు నేరుగా తన కుటుంబానికే చెందిన గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడానికి సిద్ధమైపోయాడు. దీన్ని శుక్రవారం జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మా కార్పొరేటర్లు అడ్డుకుంటారు.
ఈ భూ బదలాయింపు అంశాన్ని అజెండా నుంచి తీసేస్తే తప్ప కౌన్సిల్ సమావేశాన్ని జరగనివ్వం. గతంలో చంద్రబాబు ఈ యూనివర్సిటీకి రూ.15 లక్షలకే ఇచ్చిన 71 ఎకరాల భూమి విలువ ఇప్పుడు రూ.7 వేల కోట్లు ఉంటుంది. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు


