సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారంతో అంబటి ఇంటికి భారీగా తరలి వచ్చినవారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీడీపీ గూండాలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్టా అంబటిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. దాడితో భయాందోళనకు గురైన అంబటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించేందుకు వచ్చారు.

జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలి వచ్చారు. అయితే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లను అడ్డుకుని బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పరిస్థితి హీటెక్కింది. అయితే.. జగన్ వచ్చాక మరోసారి అలాంటి పరిస్థితే కనిపించింది.
అంతకు ముందు.. గుంటూరు నగరంలో
అంతకు ముందు గుంటూరు నగరంలోకి వచ్చే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. గుంటూరు నగరంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు స్వాగతం చెప్పేందుకు వైఎస్సార్‌సీసీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, వైఎస్ జగన్ కాన్వాయి వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు.

ఫాలో ఆప్ వాహనాలను చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని నెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సైతం ఉద్రిక్తత నెలకొంది. ఇలా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు చేపట్టిన వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున్నా అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటకీ జగన్‌పై ఉన్న అమితమైన అభిమానం ఎప్పటికీ తగ్గదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు. భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన జనసంద్రాన్ని తలపించింది.


