గ్రామసభలో తెగేసి చెప్పిన నాగరాజుపల్లి తండా రైతులు
ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం సాగుభూములు ఇవ్వాలని కోరిన అధికారులు
అన్నదాతల తీవ్ర వ్యతిరేకతతో వెనుదిరిగిన వైనం
మార్టూరు: పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి తండావాసులు అధికారులకు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న తమ భూముల్ని ఇవ్వబోమని మంగళవారం ముక్తకంఠంతో చెప్పారు. దీంతో గ్రామసభ నుంచి అధికారులు మౌనంగా వెనుదిరిగారు. తండా రెవెన్యూ పరిధిలోని 445, 453, 476 సర్వేనంబర్ల లోని 89.61 ఎకరాల కొండ పోరంబోకు భూమిలో తండాకు చెందిన 91 మంది రైతులకు గత ప్రభుత్వ హయాంలో పట్టాలు పంపిణీ చేశారు.
వాస్తవానికి ఈ భూమిని ఆ రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం పట్టాలు, పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో వారికి ఆ భూమిపై శాశ్వతహక్కు ఏర్పడింది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఈ భూమి అనువుగా ఉంటుందని మండల రెవెన్యూ అధికారులు గతవారం కలెక్టర్ వినోద్‌కుమార్‌కు చూపించారు. ఈ క్రమంలో తండావాసులు 20 మంది ఇటీవల బాపట్లలో కలెక్టర్‌ను కలిసి పార్కు నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వబోమని చెప్పారు. దీంతో కలెక్టర్ బలవంతంగా భూమి సేకరించబోమని వారికి తెలిపారు.
అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పుకోవచ్చని సూచించారు. దీన్లో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఫణి, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ ప్రశాంతి సిబ్బందితో కలిసి తండాలో గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. పట్టాలు పొందిన రైతులంతా తమ భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, పాసుపుస్తకాల వలన బ్యాంకు లోన్లు, సంక్షేమ పథకాలు పొందగలుగుతున్నామని, తమ కడుపు మీద కొట్టవద్దని పేర్కొన్నారు.
తండా పరిధిలోని సర్వేనంబర్ 475లో గల 53 ఎకరాల్లో కొత్తగా పట్టాలిస్తామని, ఈ భూమిని పార్కు కోసం వదిలేయాలని అధికారులు అడిగారు. ఆ భూమిని పదేళ్ల కిందటే పార్కు ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాదించగా ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా మా భూమిలో పార్కు నిర్మిస్తామనటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. ఆ 53 ఎకరాల్లోనే పార్కు ఏర్పాటు చేసుకోవచ్చుగదా అని నిలదీశారు.
ఒకదశలో అధికారులు రైతులను పట్టా, పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ జిరాక్స్ కార్డులను ఇవ్వాలని అధికారులు కోరారు. దీనికి రైతులు నిర్ద్వందంగా తిరస్కరించారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు అధికారులకు అర్జీ సైతం ఇచ్చారు. దీంతో అధికారులు తిరుగుముఖం పట్టారు.


