మంత్రి భరత్‌ అనుచరుల అరాచకం | Kurnool Incident: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మంత్రి భరత్‌ అనుచరుల అరాచకం

Mar 14 2026 6:21 AM | Updated on Mar 14 2026 6:21 AM

Kurnool Incident: Andhra pradesh

వంశీ, మనోజ్, సాయి (బ్లూ షర్టు వ్యక్తి)

రోడ్డుపై మద్యం తాగి వీరంగం

మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్య ప్రవర్తన

అడ్డొచ్చిన ఆర్‌ఎస్‌ఐపై తిరుగుబాటు 

ఇందులో ఒకరు ఎంఎస్‌ఎంఈ స్టేట్‌ డైరెక్టర్‌

కర్నూలు: మంత్రి టీజీ భరత్‌ అనుచరుల అరాచకాలు కర్నూలులో శృతిమించాయి. మద్యం మత్తులో మహిళా పోలీసు అధికారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక అడ్డొచ్చిన ఆర్‌ఎస్‌ఐపై తిరగబడి వీరంగం సృష్టించిన ఘటన వెలుగుచూసింది. మంత్రి టీజీ భరత్‌ ముఖ్య అనుచరులు భీమిశెట్టి మనోజ్‌ కుమార్, వంశీ, సాయి ఈ నెల 11న రాత్రి టానిక్‌ వైన్స్‌లో బీర్లు కొని.. అక్కడి ఐదు రోడ్ల కూడలిలో రోడ్డుపైనే తాగి బాటిళ్లను పగలగొడుతుండగా అదే దారిలో స్కూటీపై వెళ్తున్న మహిళా ఎస్‌ఐ వారించారు. దీంతో వారు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు.

మద్యం మత్తులో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అదే సమయంలో ఆర్‌ఎస్‌ఐ రమేష్‌ విధి నిర్వహణలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని ఆర్‌ఎస్‌ఐ వారిని దండించడంతో ఆయనపై తిరగబడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఆర్‌ఎస్‌ఐ వెంటనే క్యూఆర్‌టీ, బ్లూ కోల్ట్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మంత్రి అనుచరులు ముగ్గురునీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి తమదైన పద్ధతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.

ఇందులో ఒకరు ఎంఎస్‌ఎంఈ స్టేట్‌ డైరెక్టర్‌
మద్యం మత్తులో మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి అనుచరుడు భీమిశెట్టి మనోజ్‌ కుమార్‌ మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) స్టేట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతను గతంలో టీడీపీ తరపున 44వ వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మంత్రి అండతో రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నాడు. ఉద్యోగులకు పోస్టింగులు, బదిలీల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు మనోజ్‌పై మంత్రికి గతంలో ఫిర్యాదులు కూడా అందాయి.

నాలుగు నెలల క్రితం ఓ మహిళా అధికారికి కర్నూలు డీఎంహెచ్‌వో  పోస్టింగ్‌ ఇప్పిస్తానని చెప్పి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇతనితోపాటు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మరొకరు వైన్‌ షాపు నిర్వాహకులు, సాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ముగ్గురు కూడా మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో కనీసం కేసు కూడా నమోదు చేయకుండా వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement