పలాసలో కిడ్నీ మార్పిడి విజయవంతం | Successful Kidney Transplant Performed in Palasa | Sakshi
Sakshi News home page

పలాసలో కిడ్నీ మార్పిడి విజయవంతం

Mar 14 2026 6:07 AM | Updated on Mar 14 2026 6:07 AM

Successful Kidney Transplant Performed in Palasa

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ రవిరాజు తదితరులు

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో తొలిసారి కిడ్నీ మార్పిడి 

ఆపరేషన్‌ తండ్రి, కుమార్తె క్షేమం 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రీసెర్చ్‌ సెంటర్, ఆస్పత్రి నిర్మాణం

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో శుక్రవారం సోంపేటకు చెందిన సీహెచ్‌ హేమశ్రీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమె తండ్రి మోహనరావు కిడ్నీ దానం చేశారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసిన అనంతరం ఆస్పత్రి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజీహెచ్‌ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ పలాస వంటి మారుమూల చిన్నపట్టణంలో మెడికల్‌ కళాశాల లేనిచోట కిడ్నీ మార్పిడి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు.

ఉద్దానం ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పారు. కిడ్నీ మార్పిడిని 15 ఏళ్ల కిందట కేజీహెచ్‌లో తానే ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు, గుంటూరు వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో ఈ సదుపాయాలున్నాయని చెప్పారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి, ఆస్పత్రి నిర్మించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఈ సదుపాయాలు కలుగుతున్నాయన్నారు. రెండు కిడ్నీలు పాడైపోయిన హేమశ్రీకి ఆమె తండ్రి కిడ్నీ ఇచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్‌ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయిందన్నారు.

మార్పిడి తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్‌ బాగానే ఉందని చెప్పారు. ఎనీ్టఆర్‌ వైద్యసేవ, ఆస్పత్రి నిధుల నుంచి ఈ ఆపరేషన్‌ చేసినట్లు తెలిపారు. కిమ్స్, జెమ్స్‌ ఆస్పత్రుల నుంచి వచ్చిన డాక్టర్లు ఉమామహేశ్వరరావు, పూర్ణచంద్ర, వివేకానంద, అశోక్‌వర్ధన్, జోగినాయుడు, స్థానిక వైద్యులు రాకే‹Ù, జ్యోత్స్న, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జె.కిశోర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.

ఆస్పత్రి కట్టించినవారికి అభినందనలు  
నెఫ్రాలజిస్టు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత చక్కటి ఆస్పత్రి నిర్మించిన వారిని, అన్ని సదుపాయాలు కల్పించినవారిని ముందుగా అభినందించాలన్నారు. ఇలాంటి మారుమూ­ల ప్రాంతంలో అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయడం ఇదే మొదటిసారని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో ఆస్పత్రి నిర్మించి, ప్రారంభించారు 
టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ హయాంలో ఈ ఆస్పత్రి నిర్మించి ప్రారంభించారని చెప్పారు. మరిన్ని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ ఆపరేషన్‌ పునాది అవుతుందని ఆమె పేర్కొన్నారు. – గౌతు శిరీష, టీడీపీ ఎమ్మెల్యే 

Advertisement
 
Advertisement
Advertisement