టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల విద్యార్థులు | AP 10th Class Exams Begin from March 16: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల విద్యార్థులు

Mar 14 2026 5:50 AM | Updated on Mar 14 2026 5:50 AM

AP 10th Class Exams Begin from March 16: Andhra Pradesh

ఈ నెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 

రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో  6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు విధానంలో నమోదు చేసుకున్నారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరినీ లోనికి అనుమతించబోమని పరీక్షల విభాగం పేర్కొంది. మొత్తం విద్యార్థుల్లో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

3,415 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ప్రతీ కేంద్రానికి సీఎస్, డీవోను నియమించారు. 38,958 మందిని ఇన్విజిలేటర్లుగా, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు 156 ఫ్లయింగ్‌స్కా్వడ్స్‌ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో పెట్టారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 24 పేజీల ప్రధాన ఆన్సర్‌ బుక్‌లెట్‌ను అందిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అవసరమైతే మరో 12 పేజీల అడిషనల్‌ బుక్‌లెట్‌ తీసుకోవచ్చని సూచించింది. విద్యార్థులు కచ్చితంగా ఒరిజినల్‌ హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరుకావాలని పేర్కొంది. ఫోన్, స్మార్ట్‌ వాచ్, కాలిక్యులేటర్లు అనుమతించబోమని స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement