సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్‌ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం.


