విశాఖ నడిబొడ్డున బాణసంచా భారీ పేలుడు | Huge explosion in Gopalapatnam Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ నడిబొడ్డున బాణసంచా భారీ పేలుడు

Mar 15 2026 10:50 PM | Updated on Mar 16 2026 5:07 AM

Huge explosion in Gopalapatnam Visakhapatnam

గోపాలపట్నం(విశాఖ): విశాఖపట్నం నడి బొడ్డున ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఓ భవనం పై అంతస్తులో బాణసంచా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. పేలుడి ధాటికి భవన శిథిలాలు ఎగిరి వీధుల్లో పడ్డాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. ఓ మహిళ మాత్రం అస్వస్థతకు గురయ్యా­రు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖలోని గోపాలపట్నం ఆదర్శనగర్‌ ప్రాంతంలో రెండస్తుల భవనంలోని పై అంతస్తును బాంబుల కృష్ణ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని అక్కడ బాణసంచా తయారు చేస్తున్నాడు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ కార్యకలాపాలు జరిగేవి. 

అయితే ఆదివారం సాయంత్రం 5.30 గంటలు, ఆరు గంటల మధ్య సమయంలో ఇక్కడ పేలుడు సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భవన శిథిలాలు వీధుల్లో ఎగరి పడడంతో భవనం వెనుకవైపు ఉన్న రేకుల షెడ్డు తీవ్రంగా దెబ్బతింది. అక్కడే ఉన్న ఓ ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పక్క భవనంలో ఉంటున్న దివ్య అనే మహిళ శబ్ద కాలుష్యం, వ్యాపించిన దట్టమైన పొగకు అస్వస్థతకు గురైంది. ఆమెను గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.  


హెచ్చరించినా.. వినని నిర్వాహకుడు! 
ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోటలో బాణసంచా పేలుడు సంభవించి 20 మంది మరణించడంతో విశాఖ గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదర్శనగర్‌లోని ఈ బాణసంచా తయారీ కేంద్రాన్నీ తనిఖీ చేశారు. అప్పట్లో కొంత మందుగుండు సామగ్రిని స్వాదీనం చేసుకుని తయారీ ఆపేయాలని హెచ్చరించారు. బాణసంచా తయారు చేస్తున్న బాంబుల కృష్ణ దుకాణాన్ని తనిఖీ చేశారు. 

అయినా నిర్వాహకుడు తయారీ ఆపలేదని, నిల్వ భారీగా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.  సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు, ఎస్‌ఐ రామారావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాణసంచా తయారీదారుడు ‘బాంబుల కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement