నజీర్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.
తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్‌సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు.
అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్‌ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు.
చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్‌నకు గురయ్యారని సీఐ హుస్సేన్‌బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు.


