డీఎస్పీ జోక్యంతో కేసు నమోదు
ఆత్మకూరు: కులం పేరుతో దూషించడంతోపాటు కర్రతో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారమైనా చేజర్ల పోలీసులు పట్టించుకోలేదు. ఆత్మకూరు డీఎస్పీ జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్య ఈనెల 6వ తేదీన పొలంలో మేకలు మేపుతున్నాడు. పక్క పొలానికి చెందిన నరాల వెంకటేశ్వర్లు తాను సాగుచేస్తున్న జీలుగ పైరులో పశువులు రాకుండా చూడాలని గంగయ్యకు చెప్పి ఇంటికెళ్లాడు. అదే సమయంలో గ్రామంలో అధికార కూటమి పార్టీకి చెందిన సుధాకర్ జీలుగ పైరులో మేకల్ని తోలాడు. గంగయ్య అలా చేయొద్దనగా సుధాకర్ నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేశాడు. దీంతో గంగయ్య తల, చేతికి గాయాలయ్యాయి. కొద్దిసేపటికి సుధాకర్ వెళ్లిపోయాడు. అదేరోజు బాధితుడు చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పి పంపారు. వారం రోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో ఎస్సైని ఫోన్‌లో సంప్రదించగా స్టేషన్‌కు వస్తే రాజీ చేస్తానని, రాకపోతే మీపై కూడా కేసు పెడతానంటూ బెదించాడని బాధితుడు వాపోయాడు. పలువురి సాయంతో డీఎస్పీ కె.వేణుగోపాల్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేశారు.


