చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం
● రూ. 25 లక్షల విలువైన సామగ్రి దగ్ధం
ఉదయగిరి: పట్టణంలోని పంచాయ తీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీబాలాజీ చెప్పుల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్ని గుర్తించిన స్థానికులు యజమాని కె.వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వెంటనే అతనొచ్చి షట్టర్ తీసి చూడగా అప్పటికే పూర్తిగా మంటలు వ్యాపించాయి. రూ.25 లక్షల సామ గ్రి దగ్ధమైంది. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దుకాణం వెనుకవైపు ఉన్న కిటికీ ద్వారా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిప్పంటించారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


