జనవరిలో సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు www. bseap.gov.inలో దరఖాస్తు చేసుకొని, ఆపై కాపీని డౌన్‌లోడ్ చేసి డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఫీజును ఈ నెల 27లోపు చెల్లించాలని కోరారు. డ్రాయింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.150.. హ్యాండ్లూమ్ వీవింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.200.. టైలరింగ్, ఎంబ్రాయిడరీ – లోయర్ గ్రేడ్ రూ.150.. హయ్యర్ గ్రేడ్ రూ.200 ఫీజును చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే నెల మూడు వరకు.. రూ.75తో వచ్చే నెల ఆరు అవకాశముందని చెప్పారు.
పిన్నెల్లి సోదరులతో
అనిల్ ములాఖత్
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు.
మర్యాదపూర్వకంగా..
కొడవలూరు: మాజీ మంత్రి, వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వీరి చలపతిరావు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు, పార్టీ ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, నేత కలువ బాలశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లైంగిక దాడి కేసులో
తండ్రికి జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): కన్న కూతురిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు దశరథ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల మేరకు.. వింజమూరు బీసీ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ దశరథ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌లోని మేనమామ ఇంట్లో ఉండేవారు. 12 ఏళ్ల రెండో కుమార్తె ఎనిమిదో తరగతి వరకు చదువుకొని ఇంటి పనుల్లో తల్లికి చేదోడువాదోడుగా ఉండేవారు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకోవడంతో భార్య విసిగిపోయి తన సోదరుడి ఇంటికెళ్లిపోయారు. ఆపై పెద్దలు రాజీచేయడంతో ఇంటికొచ్చారు. ఈ తరుణంలో దుస్తులు, చెప్పులను కొనిస్తానని చెప్పి కుమార్తెను ఇంటి నుంచి 2020, జూన్ 25వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో వింజమూరు తీసుకెళ్లారు. ఆ సమయంలో దుకాణాల్లేకపోవడంతో కలిగిరిలోని బంధువులు ఇంటికి రాత్రి వెళ్లారు. కొద్దిసేపటికి బయల్దేరగా, మార్గమధ్యలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సెంటర్‌లో బాలికను వదిలి వైన్ షాపులో మద్యం సేవించొచ్చారు. ఆపై వింజమూరు బయల్దేరగా, మార్గమధ్యలో నేరేడుపల్లి సమీపంలోని నిమ్మ తోట వద్ద బైక్‌ను ఆపి కుమార్తెను చెట్ల చాటుకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై తల్లికి బాలిక మరుసటి రోజు చెప్పారు. దీంతో తల్లి తన బంధువులతో కలిసి వింజమూరు పోలీస్‌స్టేషన్లో అదే ఏడాది జూన్ 27న ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు కావడంతో కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపి దశరథ్‌ను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు.
జనవరిలో సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు


