తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
● సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన
జక్కంపూడి రాజా
● జోగి రమేష్ సోదరులతో ములాఖత్
వెంకటాచలం: సీఎం చంద్రబాబు చేసే తప్పులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడితో శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు సాగిస్తున్న నకిలీ మద్యం తయారీని జోగి రమేష్‌కు అంటగట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక.. సంబంధం లేని ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేయడం రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా కుట్రలు సాగిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించే యత్నం చేయలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా జోగి రమేష్ సోదరులు కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. గళం విప్పే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అణగదొక్కేందుకు యత్నించడం తగదని హితవు పలికారు. తమ పైశాచికానందం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను జైలుకు పంపినా, అది తాత్కాలికమేననే విషయా న్ని చంద్రబాబు, లోకేశ్ గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసే తప్పులపై ప్రజలు లెక్కలు కడుతున్నారని, సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. డిస్టిలరీల మొదలుకొని లిక్కర్ షాపులు, బెల్టుషాపులు ఇలా అన్నీ టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఆర్గనైజ్డ్‌గా నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వంటి వారిపైనా అక్రమ కేసులు పెట్టి వేధించారని, వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు.


