లక్షలు మింగేసి లక్షణంగా..!
వింజమూరు (ఉదయగిరి): అధికారం అండతో కొందరు చెలరేగిపోతున్నారు. లక్షలను స్వాహా చేసినా.. లక్షణంగా ఉంటున్నారు. వింజమూరు మండలం కాటేపల్లికి చెందిన సర్పంచ్ విజయలక్ష్మమ్మ అప్పట్లో విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు కలిసి రూ.లక్షల పంచాయతీ నిధులను కాజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిధుల దుర్వినియాగం వాస్తవమేనని తేల్చారు. వీటిని పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసు పెడతామంటూ సర్పంచ్‌కు నోటీస్‌ను జారీ చేశారు. అయితే అధికార పార్టీ అండతో ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయడంలేదు. ఇంత జరుగుతున్నా, క్రిమినల్ కేసును పెట్టకుండా.. నిధులను రికవరీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
మండలంలోని కాటేపల్లికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ విజయలక్ష్మమ్మ తన పదవీ కాలంలో రూ.24.13 లక్షలను స్వాహా చేశారని కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో నివేదిక ఇచ్చారు. దీంతో ఆర్నెల్ల పాటు చెక్ పవర్‌ను రద్దు చేస్తూ, 15 రోజుల్లో సంజాయిషీని జిల్లా పంచాయతీ అధికారి కోరారు. అయినా సదరు సర్పంచ్ స్పందించకపోవడంతో మరో నోటీస్‌ను గత నెల్లో జారీ చేశారు. నిధులను వారంలో పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేసి నిధులు రాబడతామని తెలిపారు. అయినా సదరు సర్పంచ్ ఖాతరు చేయలేదు. ఇంత జరిగినా ఎలాంటి చర్యలను అధికారులు చేపట్టలేదు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులపై ప్రేమెందుకో..?
పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉందని విచారణలో కందుకూరు డీఎల్పీఓ తేల్చారు. అయితే వీరిలో కార్యదర్శి ప్రసన్నలక్ష్మినే సస్పెండ్ చేశారు. మిగిలిన విజయమ్మ, శీనయ్యపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికార బలం ఉండటంతోనే చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిధుల పక్కదారి.. నేటికీ కొనసాగుతూ..
కాటేపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఇప్పటికీ జరుగుతూనే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తాగునీటి మోటార్ల రిపేర్ల పేరుతో అధిక మొత్తంలో ఎం బుక్‌లను రికార్డు చేసి నిధులను డ్రా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గరిష్టంగా రూ.12 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని, అయితే రూ.33 వేల వరకు డ్రా చేశారని చెప్తున్నారు. పంచాయతీలో రూ.29 లక్షల నిధులు అందుబాటులో ఉన్నా, ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు సర్పంచ్ తీర్మానాలివ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
భారీగా నిధుల దుర్వినియోగం
రికవరీకి ఆదేశాలిచ్చినా
పట్టించుకోని సర్పంచ్
పంచాయతీ కార్యదర్శుల తీరూ ఇంతే
అఽధికారం అండతో బేఖాతర్


